Google : సాఫ్ట్‌వేర్ ఉద్యోగమంటే అమెరికాకు వెళ్లాల్సిందే అనే రోజులు మారుతున్నాయి. ఇప్పుడు అక్కడ వీసా నిబంధనలు మరింత కఠినతరం కావడంతో, గూగుల్ (Google )వంటి దిగ్గజ కంపెనీలు ఇప్పుడు పూర్తిగా రూట్ మార్చేశాయి. ఇండియా నుంచి ఇంజనీర్లను అమెరికా పిలిపించుకోవడం కంటే… ఇండియాలోనే పెద్ద ఆఫీసులు కట్టి ఇక్కడే ఉద్యోగాలు ఇవ్వాలని గూగుల్ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా బెంగళూరులో ఏకంగా 20 వేల మంది పట్టేంత భారీ కేంపస్‌ను రెడీ చేస్తోంది.
గూగుల్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం వీసా సమస్యలేనని చెప్పాలి. ఇప్పుడు అమెరికాలో H-1B వీసా పొందడం ఇప్పుడు చాలా ఖర్చుతో కూడుకున్న పనిగా మారింది. ఒక్కో వీసా అప్లికేషన్‌కు దాదాపు 100,000 డాలర్లు (సుమారు 83 లక్షల రూపాయలు) ఖర్చు చేయాల్సిన పరిస్థితి రాబోతోంది. దీనికి తోడు వీసా ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందో తెలియని అయోమయం. అందుకే, ఈ టెన్షన్లు పడే బదులు బెంగళూరులోనే తమ కార్యకలాపాలను రెట్టింపు చేయాలని గూగుల్ ప్లాన్ చేసింది.
🚨Alphabet Plots Massive #Bengaluru Expansion to Add Up to 20,000 Jobs Amid US Visa Tightening🚨#Alphabet (Google's parent) is expanding significantly in Bengaluru's Whitefield tech corridor amid tighter #US visa restrictions.
It has leased one tower (~650,000 sq ft) in… pic.twitter.com/LOsZuGFsGm
— समृद्धम-भारतम (@DharmaBharatam) February 4, 2026
మూడు భారీ టవర్లను గూగుల్ లీజుకు
బెంగళూరులోని ఐటీ హబ్ అయిన వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో అలెంబిక్ సిటీ అనే ప్లేస్ లో గూగుల్ ఈ ఆఫీసును ఏర్పాటు చేస్తోంది. మొత్తం మూడు భారీ టవర్లను గూగుల్ లీజుకు తీసుకుంది. వీటి వైశాల్యం సుమారు 24 లక్షల చదరపు అడుగులు. ఇప్పటికే ఒక భవనం సిద్ధమైపోయింది, మిగిలిన రెండు వచ్చే ఏడాది నాటికి పూర్తవుతాయి. ప్రస్తుతం భారత్‌లో గూగుల్‌కు 14 వేల మంది ఉద్యోగులు ఉండగా, ఈ కొత్త ఆఫీస్ వస్తే ఆ సంఖ్య రెట్టింపు కానుంది.
గతంలో ఇండియాలోని ఆఫీసుల్లో కేవలం కస్టమర్ సపోర్ట్ లేదా చిన్న చిన్న పనులు మాత్రమే చేసేవారు. కానీ ఇప్పుడు గూగుల్ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్, చిప్ డిజైనింగ్ వంటి అత్యంత కీలకమైన ప్రాజెక్టులను చేపట్టబోతోంది. ఇందుకోసం పిహెచ్‌డీ చేసిన నిపుణులను కూడా భారీగా నియమించుకుంటోంది. యూట్యూబ్ ఇంజనీరింగ్ టీమ్స్ కూడా ఇక్కడి నుంచే పనిచేయనున్నాయి.
ఒక్క గూగుల్ మాత్రమే కాదు.. మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆపిల్, మెటా వంటి కంపెనీలు కూడా ఇండియాలో తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుతున్నాయి. గత ఏడాదిలోనే ఈ కంపెనీల భారతీయ ఉద్యోగుల సంఖ్య 16 శాతం పెరిగింది. అమెరికా వీసా నిబంధనలు ఎంత కఠినంగా మారితే, భారత్‌లోని ఐటీ రంగానికి అంత లాభం చేకూరుతుందని టెక్ నిపుణులు అంటున్నారు.
