Home Loan Tips : సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. కానీ ఆ కల కోసం బ్యాంకుల దగ్గర అప్పు చేస్తే.. 20 ఏళ్ల పాటు EMIలు కడుతూనే ఉండాలి. చివరికి మనం తీసుకున్న అప్పు కంటే బ్యాంకులు వసూలు చేసే వడ్డీనే ఎక్కువగా ఉంటుంది. అయితే, ఒక చిన్న ట్రిక్ (Home Loan Tips )పాటిస్తే మీరు కట్టే వడ్డీలో ఏకంగా రూ. 20 లక్షల వరకు ఆదా చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలామంది నెలనెలా 12 EMIలు మాత్రమే కడతారు. కానీ, ఏడాదికి 12 నెలలకు బదులుగా 13 EMIలు కట్టండి. అంటే సంవత్సరానికి కేవలం ఒకే ఒక్క అదనపు EMI చెల్లించాలన్నమాట. ఇలా లోన్ తీసుకున్న రెండో సంవత్సరం నుండి చేయడం వల్ల మీరు కట్టే ఆ అదనపు అమౌంట్ నేరుగా మీ అసలు ఖాతాలో జమ అవుతుంది. దీనివల్ల వడ్డీ భారం వేగంగా తగ్గుతూ వస్తుంది.
ఉదాహరణకు మీరు రూ. 50 లక్షల హోమ్ లోన్‌ను 9% వడ్డీ రేటుతో 20 ఏళ్ల కాలపరిమితికి తీసుకున్నారనుకుందాం. మామూలుగా కడితే మీ నెలవారీ EMI సుమారు రూ. 45 వేలు అవుతుంది. 20 ఏళ్లలో మీరు కట్టే మొత్తం వడ్డీ దాదాపు రూ. 58 లక్షలు. అంటే తీసుకున్న 50 లక్షల అప్పుకి, అదనంగా మరో 58 లక్షలు వడ్డీ కట్టాలన్న మాట. ఏడాదికి ఒక నెల EMI రూ.45 వేలు అదనంగా కడితే, మీ లోన్ 20 ఏళ్ల వరకు ఉండదు. అది సుమారు 15 ఏళ్లలోనే తీరిపోతుంది.
దీనివల్ల మీరు కట్టాల్సిన వడ్డీలో సుమారు రూ.18 నుండి 20 లక్షల వరకు ఆదా అవుతుంది. అలాగే 5 ఏళ్ల ముందే మీరు అప్పుల ఊబి నుంచి బయటపడవచ్చు. మనం కట్టే సాధారణ EMIలో ఎక్కువ భాగం వడ్డీకే వెళ్తుంది, అసలు చాలా తక్కువగా తగ్గుతుంది. కానీ ఈ ’13వ EMI’ ని బ్యాంకులు నేరుగా అసలు కింద జమ చేస్తాయి. అసలు తగ్గినప్పుడు దాని మీద పడే వడ్డీ కూడా ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. దీనినే ప్రీ-పేమెంట్ పవర్ అంటారు.
మీరు అదనపు EMI చెల్లించేటప్పుడు, ఆ మొత్తం మీ అసలు కింద జమ అవుతోందో లేదో ఒకసారి బ్యాంకును అడిగి కన్ఫర్మ్ చేసుకోండి.
