Tension Tips : ఈ రోజుల్లో చిన్నపిల్లాడి నుండి ముసలివారి వరకు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న అతిపెద్ద సమస్య ఒత్తిడి(Tension ). ఆఫీసు టెన్షన్లు, కుటుంబ సమస్యలు, భవిష్యత్తు గురించి భయం.. ఇలా కారణం ఏదైనా మనిషి ప్రశాంతత కోల్పోతున్నాడు. అయితే, వేల ఏళ్ల క్రితమే కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు కూడా సరిగ్గా ఇలాంటి ఒత్తిడికే లోనయ్యాడు. అప్పుడు కృష్ణుడు అతనికి చెప్పిన మూడు ముఖ్యమైన విషయాలు పాటిస్తే, ఈ కాలంలో కూడా మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అవేంటో ఒకసారి చూద్దాం.
ఫలితం గురించి అతిగా ఆలోచించకండి
మనం పడుతున్న సగం టెన్షన్‌కు కారణం రేపు ఏమవుతుందో అని ముందుగానే ఊహించుకోవడం. పరీక్ష ఫెయిల్ అయితే ఏంటి?, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వకపోతే ఎలా? అని భయపడతాం. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మొదటి సూత్రం: నీ పని చేయడం వరకే నీ చేతుల్లో ఉంది, ఫలితం కాదు. మీరు ఫలితం గురించి భయపడితే పని మీద దృష్టి తగ్గుతుంది. కాబట్టి, ఫలితాన్ని కాలానికి వదిలేసి, ప్రస్తుత క్షణంలో మీరు చేయాల్సిన పనిని 100% శ్రద్ధతో చేయండి. పని బాగుంటే ఫలితం ఆటోమేటిక్ గా బాగుంటుంది.
మార్పును స్వీకరించండి
జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. ఈ రోజు మీకు కష్టంగా ఉండవచ్చు, కానీ అది రేపు మారుతుంది. అర్జునుడు తన బంధువులను చూసి బాధపడినప్పుడు, కృష్ణుడు ‘మార్పు’ అనేది ప్రకృతి ధర్మమని గుర్తు చేశాడు. మన జీవితంలో కూడా ఓటమి వచ్చినా, కష్టం వచ్చినా.. ఇది కూడా గడిచిపోతుంది అని భావించాలి. మార్పును ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, అప్పుడు మన మనసు కుదుటపడుతుంది.
మిమ్మల్ని మీరు నమ్మండి
యుద్ధరంగంలో అర్జునుడు కుంగిపోయినప్పుడు, కృష్ణుడు అతనికి తన శక్తిని గుర్తు చేశాడు. మనందరిలో ఏదో ఒక గొప్ప శక్తి ఉంటుంది. కానీ పక్కవాళ్ళతో పోల్చుకోవడం వల్లనో, ఇతరులు ఏమనుకుంటారో అనే భయం వల్లనో మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటాం. మీ ధర్మాన్ని నమ్మి మీరు ముందడుగు వేస్తే, విజయానికి దారి అదే దొరుకుతుంది.
ఈ మూడు సూత్రాలను రోజువారీ జీవితంలో పాటిస్తే, ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండటం సాధ్యమే. అందుకే అంటారు. సమస్య ఏదైనా, సమాధానం గీతలో ఉంటుంది!
