Nampally Fire Accident : కుట్రనా? ..ప్రమాదమా?.. మంటల్లో బూడిదైన పెద్ద పెద్ద కేసులు!

Nampally fire accident

Nampally Fire Accident : నేర పరిశోధనలో అత్యంత కీలకమైన నాంపల్లిలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) శనివారం మంటల్లో (Nampally Fire Accident)చిక్కుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనేక కేసుల భవిష్యత్తును నిర్ణయించే కీలక ఆధారాలు ఈ ప్రమాదంలో అగ్నికి ఆహుతయ్యాయి. కేవలం భవనం మాత్రమే కాదు, దశాబ్దాల నాటి డేటా, వేల కోట్ల రూపాయల రాజకీయ మరియు నేర చరిత్రకు సంబంధించిన సాక్ష్యాలు బూడిద కావడంతో సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ అగ్నిప్రమాదంలో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులోని ఆడియో, వీడియో క్లిప్పింగులు, ఎమ్మెల్యేల ఎర కేసు ఫైల్స్ మరియు ఇటీవల తెలంగాణను ఊపేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కీలక డిజిటల్ సాక్ష్యాలు దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఇక్కడి DNA ఫింగర్ ప్రింటింగ్ విభాగంలో భద్రపరిచిన పాత కేసుల రికార్డులు కూడా మంటల ధాటికి కాలిపోయాయి. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 40 నుంచి 50 కంప్యూటర్లు, డేటా స్టోర్ చేసిన హార్డ్ డిస్క్‌లు పూర్తిగా పనికిరాకుండా పోయాయి.

ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఆఫీసర్ శ్రీధర్ ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ అని చెబుతున్నప్పటికీ, కీలక కేసుల విచారణ తుది దశలో ఉన్న సమయంలోనే ఈ ప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా డిజిటల్ ఎవిడెన్స్ స్టోర్ చేసే రూమ్‌లోనే మంటలు భారీగా ఎగసిపడటం చర్చనీయాంశంగా మారింది. ఫిజికల్ ఎవిడెన్స్ కూడా కాలిపోవడంతో, ఇకపై కోర్టులో నేరస్థులకు శిక్ష పడటం కష్టమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం రెండు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ కాబట్టి, ఇక్కడ భద్రత లోపాలు ఎలా తలెత్తాయనే దానిపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం ప్రత్యేక విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. సాక్ష్యాలన్నీ కాలిపోయిన నేపథ్యంలో, పెండింగ్‌లో ఉన్న కీలక కేసుల దర్యాప్తు ఇప్పుడు అంధకారంలో పడిపోయింది.