Barabar Premistha : రాడ్డు దింపారు : చంద్రహాస్‌కు బరాబర్‌ షాక్.. ఖాళీ కుర్చీలతో థియేటర్లు!

Barabar Premistha movie

Barabar Premistha : టాలీవుడ్‌లో వరుస వివాదాలు, బూతు పాటలతో వార్తల్లో నిలిచిన యువ హీరో చంద్రహాస్‌కు ఆడియన్స్ గట్టి షాకే ఇచ్చారు. భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన బరాబర్‌ ప్రేమిస్తా (Barabar Premistha) సినిమాకు బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరిస్థితి ఎదురవుతోంది. సినిమాకు ఫ్లాప్ టాక్ రావడమే కాకుండా, థియేటర్లకు జనం రాక వెలవెలబోతున్నాయి.

విడుదలకు ముందు ఎంత ప్రచారం చేసినా, ఆడియన్స్ మాత్రం ఈ సినిమాను అస్సలు పట్టించుకోవడం లేదని అర్థమవుతోంది. దానికి నిదర్శనమే ఈ థియేటర్ సీటింగ్ పిక్చర్. హైదరాబాద్‌లోని చిలకలగూడ వి.ఎల్.ఎస్ శ్రీదేవి థియేటర్‌లో ఈరోజు (శనివారం) సాయంత్రం 6 గంటల షోకు సంబంధించి ఒక్క సీటు కూడా బుక్ అవ్వకపోవడం గమనార్హం. దాదాపు థియేటర్ మొత్తం ఖాళీగా దర్శనమిస్తోంది. కేవలం ఈ ఒక్క థియేటరే కాదు, మెజారిటీ స్క్రీన్లలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో చంద్రహాస్ పాడిన బూతు పాట ఈ సినిమాపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు కనిపిస్తోంది. స్టేజ్ మీద గుంజీ గుంజీ… అంటూ అసభ్యకరమైన పదజాలంతో పాట పాడటంపై అటు ఇండస్ట్రీలోనూ, ఇటు సామాన్య జనం నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. తన తప్పును ఒప్పుకోకుండా, ఆ పాటను సమర్థించుకోవడం ఆడియన్స్‌కు మరింత విసుగు తెప్పించింది. ఇలాంటి బూతు నెగిటివిటీ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా దరిదాపుల్లోకి కూడా వెళ్లడం లేదు.

సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్, నెగిటివ్ టాక్‌తో చంద్రహాస్‌కు ఆడియన్స్ ‘రిటర్న్ గిఫ్ట్’ ఇచ్చారు. సినిమా కంటెంట్ వీక్ గా ఉండటం, హీరో వైఖరి నచ్చకపోవడంతో జనం థియేటర్లకు రావడం మానేశారు. మొత్తం మీద చూస్తే, బరాబర్‌ ప్రేమిస్తా అంటూ వచ్చిన చంద్రహాస్‌కు ప్రేక్షకులు మాత్రం బరాబర్‌ షాక్ ఇచ్చారని చెప్పక తప్పదు.