Kamalakar Bhat : టీవీల్లో కనిపిస్తూ అందరికీ భవిష్యత్తు చెబుతాననే ఒక జ్యోతిష్యుడు, ఇప్పుడు తనే(Kamalakar Bhat) జైలు పాలయ్యాడు. ఒక ఆడదాని మోజులో పడి, అడ్డొచ్చిన వ్యక్తిని కత్తితో పొడిచి చంపేసిన ఘటన ఉత్తర కన్నడ జిల్లాలో సంచలనంగా మారింది.
ఈ కథలో విలన్ పేరు కమలాకర్ భట్. ఈయన పెద్ద జ్యోతిష్యుడు. సుచిత్ర అనే ఆవిడ తన భర్త మహేష్‌తో కలిసి జ్యోతిష్యం అడగడానికి ఈ గురూజీ దగ్గరికి వెళ్ళింది. కానీ, అక్కడ జ్యోతిష్యం పక్కన పెట్టి, ఆ గురూజీతోనే సుచిత్ర అక్రమ సంబంధం పెట్టుకుంది. 15 ఏళ్ల కాపురం, ఇద్దరు పిల్లలున్నారన్న సంగతి కూడా మర్చిపోయి ఆ జ్యోతిష్యుడితోనే ఉండటం మొదలుపెట్టింది.

తల్లి తనతో పాటు జ్యోతిష్యుడి దగ్గరే ఉండటంతో, పెద్ద కూతురు భరించలేకపోయింది. “అమ్మ నన్ను వేధిస్తోంది, నేను ఇక్కడ ఉండలేను” అని తన తండ్రి మహేష్‌కు మెసేజ్ చేసింది. దీంతో తండ్రి మహేష్ తన కూతురిని తీసుకొచ్చి, భార్య మీద పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు..
తన మీద పోలీసులకు కంప్లైంట్ ఇస్తారా అని రగిలిపోయిన సుచిత్ర, తన తండ్రిని, జ్యోతిష్యుడు కమలాకర్ భట్‌ను తీసుకుని రాత్రికి రాత్రే మహేష్ ఇంటి మీదకు వెళ్ళింది. చేతిలో కత్తులు పట్టుకుని మహేష్‌ను చంపడానికి చూశారు. ఆ సమయంలో మహేష్‌ను కాపాడటానికి అడ్డువచ్చిన వసంత్ నాయక్ (మహేష్ బావమరిది)ని కత్తితో పొడిచేశారు. తీవ్రంగా గాయపడిన వసంత్ ఆసుపత్రిలో ప్రాణాలు విడిచాడు.
విషయం తెలిసిన గ్రామస్థులంతా పోలీస్ స్టేషన్ ముందు పోగయ్యారు. “ఆ దొంగ జ్యోతిష్యుడిని మాకు అప్పగించండి, మనిషిని చంపిన వాడిని వదలద్దు” అంటూ గొడవ చేశారు. పోలీసులు జ్యోతిష్యుడితో పాటు నలుగురిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
కమలాకర్ భట్ ఎవరంటే?
కమలాకర్ భట్ కేవలం ఒక సాధారణ జ్యోతిష్యుడు మాత్రమే కాదు, కర్ణాటకలోని ప్రముఖ కన్నడ ఆధ్యాత్మిక ఛానెళ్లలో నిత్యం కనిపించే వ్యక్తి. కర్ణాటకలోని పేరున్న న్యూస్ ఛానెళ్లలో ఉదయం పూట వచ్చే రాశిఫలాలు, జ్యోతిష్య కార్యక్రమాల ద్వారా ఇతను బాగా ఫేమస్ అయ్యాడు.
తన మాటలతో భక్తులను, ముఖ్యంగా మహిళలను ఎక్కువగా ఆకర్షించేవాడు. సెలబ్రిటీ స్టేటస్ ఉండటంతో ఇతని మాటలను ప్రజలు గుడ్డిగా నమ్మేవారు. ఇతను ఉత్తర కన్నడ జిల్లాకు చెందినవాడైనప్పటికీ, బెంగళూరులో సెటిల్ అయ్యి అక్కడ నుంచే తన జ్యోతిష్య సామ్రాజ్యాన్ని నడిపించేవాడు.
