Kamalakar Bhat : తమలపాకులు అమ్ముకునే జ్యోతిష్యుడు ఎలా కోటీశ్వరుడయ్యాడు?

Kamalakar Bhat

Kamalakar Bhat : కర్ణాటకలో సంచలనం సృష్టించిన జ్యోతిష్యుడు కమలాకర్ భట్ జాతకాన్ని తవ్వి తీస్తుంటే విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఒకప్పుడు సామాన్యంగా మరమరాలు, తమలపాకులు అమ్ముకునే వ్యక్తి(Kamalakar Bhat).. కేవలం కొద్ది కాలంలోనే కోట్లు ఎలా సంపాదించాడు? టీవీ స్టార్‌గా ఎలా ఎదిగాడు? అనే విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

కమలాకర్ భట్ స్వస్థలం ఉత్తర కన్నడ జిల్లాలోని సిద్ధాపుర. 2005 కంటే ముందు ఇతను చాలా పేదవాడు. సైకిల్ మీద తిరుగుతూ ఊళ్లలో మరమరాలు, తమలపాకులు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. అయితే 2005లో ఉన్నట్టుండి ఊరి నుంచి మాయమైపోయాడు. అదృశ్యమైన కమలాకర్ కేరళకు వెళ్లినట్లు చెబుతున్నారు. అక్కడ జ్యోతిష్యంతో పాటు వశీకరణ విద్యలు నేర్చుకున్నాడట. తిరిగి తన ఊరికి వచ్చి జ్యోతిష్యం మొదలుపెట్టినా మొదట్లో ఎవరూ నమ్మలేదు. కానీ, ఎప్పుడైతే తన మకాం బెంగళూరుకు మార్చాడో అప్పుడే ఇతని దశ తిరిగింది.

ఎలా కోటీశ్వరుడయ్యాడు?

బెంగళూరులోని పేరున్న న్యూస్ ఛానెళ్లలో ప్రతిరోజూ రాశిఫలాలు చెబుతూ తనను తాను పెద్ద ‘గురూజీ’గా ప్రచారం చేసుకున్నాడు.బెంగళూరు, శివమొగ్గ, హుబ్బళ్ళిలో పెద్ద పెద్ద ఆఫీసులు తెరిచాడు. ఒక్కో ఆఫీసు మెయింటైన్ చేయడానికే నెలకు 3 నుండి 4 లక్షల రూపాయలు ఖర్చు చేసేవాడంటే అతని సంపాదన ఏ రేంజ్‌లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు.

సిద్ధాపుర, శివమొగ్గ ప్రాంతాల్లో కొంతమంది బ్రోకర్లను (మధ్యవర్తులను) పెట్టుకున్నాడు. ఎవరికైనా సమస్యలు ఉన్నాయని తెలిస్తే వాళ్లను ఒప్పించి ఈ గురూజీ దగ్గరికి పంపేవారు. దీని కోసం ఆ బ్రోకర్లకు భారీగా కమిషన్లు ఇచ్చేవాడు. ఇప్పుడు హత్య కేసులో ఉన్న సుచిత్ర కూడా మొదట్లో ఇతనికి బ్రోకర్‌గానే పరిచయమైందట. ఆ తర్వాతే వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం మొదలైంది.

కేవలం జ్యోతిష్యంతోనే ఇన్ని కోట్లు వచ్చాయా? లేక వశీకరణ పేరుతో ప్రజలను మోసం చేశాడా? లేక వెనుక ఇంకేమైనా సెటిల్‌మెంట్లు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 10 ఏళ్లలోనే ఒక సామాన్యుడు కోటీశ్వరుడు కావడమే ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది.

Also Read :