Telangana Municipal election results 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన జోరును కొనసాగిస్తోంది. నేడు (ఫిబ్రవరి 13, 2026) వెలువడుతున్న ఫలితాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. తాజా అప్డేట్స్ ప్రకారం ఏ పార్టీ ఎక్కడ గెలిచిందో చూద్దాం.
కాంగ్రెస్ క్లీన్ స్వీప్:
ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. నేరేడుచర్ల, హుజూర్నగర్, హాలియా, కోదాడ, నందికొండ, చండూరు మున్సిపాలిటీలను కాంగ్రెస్ వరుసగా గెలుచుకుంది. అలాగే ధర్మపురిలో మొత్తం 15 వార్డులకు 15 దక్కించుకుని క్లీన్ స్వీప్ రికార్డు సృష్టించింది. భీంగల్, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, మంథని, హుస్నాబాద్, మరిపెడ, డోర్నకల్, నారాయణఖేడ్, అశ్వారావుపేట, మధిర వంటి కీలక పట్టణాల్లోనూ హస్తం జెండా రెపరెపలాడింది. పాలమూరు జిల్లాలో భూత్పూర్, మద్దూరు, పెబ్బేరు, కొల్లాపూర్లతో పాటు జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ను కూడా కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది.
బీఆర్ఎస్ పట్టు నిలుపుకున్న చోట్లు:
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా కొన్ని ప్రాంతాల్లో తన పట్టును నిరూపించుకుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని గడ్డపోతారం, ఇంద్రేశం మున్సిపాలిటీలతో పాటు జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజను కైవసం చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో గులాబీ జెండా విజయం సాధించింది. మంత్రి వివేక్ ఇలాకాలో షాక్ ఇస్తూ క్యాతనపల్లిలో బీఆర్ఎస్ గెలిచినప్పటికీ, మరికొన్ని చోట్ల ఫలితాలు హంగ్గా మారాయి.
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (తెలంగాణ జాగృతి మద్దతుతో) అనూహ్య విజయం సాధించింది. ప్రధాన పార్టీలను వెనక్కి నెట్టి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడం ఇక్కడ విశేషం.
పలు మున్సిపాలిటీల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. దేవరకద్ర, అలంపూర్, కోహీర్, కేసముద్రం, ఆసిఫాబాద్, అమరచింత, జనగామ, జిన్నారం, జమ్మికుంట, వేములవాడ, రాయికల్లో స్వతంత్రులు, చిన్న పార్టీల అభ్యర్థులు ఇప్పుడు కింగ్ మేకర్లుగా మారారు.
