AUS VS ZIM: టీ20 ప్రపంచకప్‌లో మరోపెద్ద సంచలనం నమోదైంది. శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్-బి పోరులో(AUS VS ZIM) జింబాబ్వే జట్టు పటిష్టమైన ఆస్ట్రేలియాను 23 పరుగుల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో టీ20 ప్రపంచకప్‌లలో ఆస్ట్రేలియాపై జింబాబ్వే తన రికార్డును కొనసాగించింది. సరిగ్గా 19 ఏళ్ల క్రితం అంటే 2007లో కూడా తొలి టీ20 ప్రపంచకప్‌లో ఆసీస్‌ను ఓడించిన జింబాబ్వే, ఇప్పుడు మళ్ళీ అదే హిస్టరీని రిపీట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రయన్ బెన్నెట్ (64 నాటౌట్) అద్భుతమైన అర్ధసెంచరీతో జట్టుకు భారీ స్కోరు అందించాడు. అతనికి తోడుగా మరిమని (35), ర్యాన్ బర్ల్ (35) రాణించగా, చివర్లో కెప్టెన్ సికందర్ రజా మెరుపులు మెరిపించాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్ పేసర్లు లేని లోటు స్పష్టంగా కనిపించింది.
170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీ తన పదునైన బౌలింగ్‌తో ఆసీస్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. దీంతో ఆస్ట్రేలియా 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో గ్లెన్ మాక్స్వెల్ (31), మ్యాట్ రెన్షా (65) ఐదో వికెట్‌కు 77 పరుగులు జోడించి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే, ముజరబానీ మళ్ళీ విరుచుకుపడటంతో ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయింది. చివరి 6 వికెట్లను కేవలం 40 పరుగుల వ్యవధిలోనే కోల్పోయిన ఆస్ట్రేలియా, 19.3 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయింది.
జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబానీ 17 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి తన కెరీర్ బెస్ట్ ప్రదర్శన చేయడమే కాకుండా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును గెలుచుకున్నాడు. మరో బౌలర్ బ్రాడ్ ఈవాన్స్ 3 వికెట్లతో రాణించాడు. ఈ ఓటమితో ఆస్ట్రేలియా సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారగా, జింబాబ్వే గ్రూప్-బి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
