Municipal Election Results 2026 : హస్తం హవా.. ఆ మూడు కార్పొరేషన్లు కాంగ్రెస్‌ పార్టీవే!

congress

Municipal Election Results 2026 :  తెలంగాణ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ మున్సిపాలిటీలతో పాటు కీలకమైన మంచిర్యాల, రామగుండం, నల్గొండ కార్పొరేషన్లలో జయకేతనం ఎగురవేసింది. ఈ మూడు చోట్లా కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించి, మేయర్ పీఠాలను కైవసం చేసుకునే దిశగా స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు.

మంచిర్యాల కార్పొరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. ఇక్కడ మొత్తం 60 వార్డులు ఉండగా, కాంగ్రెస్ ఏకంగా 41 వార్డుల్లో జయకేతనం ఎగురవేసింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ కేవలం 8 స్థానాలకే పరిమితం కాగా, బీజేపీ 4 వార్డులను దక్కించుకుంది. ఇతరులు 2 వార్డుల్లో విజయం సాధించారు.

రామగుండంలోనూ హస్తం పార్టీ తన పట్టు నిరూపించుకుంది. ఇక్కడి 60 వార్డులలో 35 వార్డులను కాంగ్రెస్ గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. బీఆర్‌ఎస్‌కు 13 వార్డులు దక్కగా, బీజేపీ కేవలం ఒక స్థానంతో సరిపెట్టుకుంది. ఇతరులు 4 వార్డుల్లో విజయం సాధించారు.

నల్గొండలో కాంగ్రెస్ పార్టీ తన కంచుకోటను కాపాడుకుంది. మొత్తం 48 వార్డులకు గాను కాంగ్రెస్ 26 వార్డుల్లో విజయం సాధించి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. బీఆర్‌ఎస్‌ 8 వార్డుల్లో, బీజేపీ 4 వార్డుల్లో గెలుపొందాయి. మిగిలిన 7 వార్డులను ఇతరులు మరియు స్వతంత్రులు కైవసం చేసుకున్నారు.