Missing Student : యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీలో చదువుతున్న భారతీయ విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య విషాదాంతం వార్త తీవ్ర కలకలం రేపుతోంది. గత ఆరు రోజులుగా కనిపించకుండా పోయిన సాకేత్, చివరకు విగతజీవిగా కనిపించాడని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించారు. సాకేత్ మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారని, ఈ కష్టసమయంలో అతని కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఎక్స్ వేదికగా కన్సులేట్ ప్రకటించింది.
సాకేత్ మరణవార్త తెలియగానే అతని కుటుంబం, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఇండియాకు తరలించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ కుటుంబానికి అండగా ఉంటామని రాయబార కార్యాలయం తెలిపింది. సాకేత్ ఆచూకీ కోసం గత కొన్ని రోజులుగా అటు అమెరికా పోలీసులు, ఇటు భారత దౌత్య అధికారులు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు.
ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి సాకేత్ కనిపించకుండా పోయాడు. బర్కిలీ హిల్స్‌లోని లేక్ అంజా సమీపంలో అతను చివరిసారిగా కనిపించినట్లు స్థానిక నివేదికలు చెబుతున్నాయి. విచారణ సమయంలో సాకేత్ కి సంబంధించిన పాస్‌పోర్ట్, ల్యాప్‌టాప్ ఉన్న బ్యాగ్ ఒక ఇంటి గుమ్మం వద్ద లభించడం కలకలం సృష్టించింది. సాకేత్ కనిపించడం లేదని అతని రూమ్మేట్ బానీత్ సింగ్ సోషల్ మీడియా ద్వారా అందరినీ సహాయం కోరారు, కానీ చివరకు ఈ గాలింపు విషాదకరంగా ముగిసింది.
చదువులో ఎంతో ప్రతిభావంతుడు
కర్ణాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య చదువులో ఎంతో ప్రతిభావంతుడు. 2025లో ఐఐటీ మద్రాస్ నుండి కెమికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసిన ఆయన, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. ప్రస్తుతం యూసీ బర్కిలీలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చదువుతున్నారు. సాకేత్ అదృశ్యంపై కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలినీ రజనీష్ కూడా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాసి సహాయం కోరారు. ఒక ఆశాకిరణంలా ఎదిగిన యువ విద్యార్థి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం అందరినీ కలిచివేస్తోంది.
