Hampi case : కర్ణాటకలోని హంపి సమీపంలో గతేడాది జరిగిన ఘోర కలికానికి సంబంధించి కొప్పల్ జిల్లా సెషన్స్ కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఒక విదేశీయురాలితో సహా ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, మరో పర్యాటకుని ప్రాణాలు తీసిన ముగ్గురు నిందితులకు న్యాయస్థానం మరణశిక్ష విధించింది.
అసలేం జరిగింది?
ఈ దారుణ ఘటన 2025 మార్చి 6వ తేదీ రాత్రి జరిగింది. హంపికి సమీపంలోని సానాపుర వద్ద ఉన్న తుంగభద్ర ఎడమ కాల్వ సమీపంలో ఒక ఇజ్రాయెల్ పర్యాటకురాలు, ఒక హోమ్‌స్టే నిర్వాహకురాలు, వారి ముగ్గురు స్నేహితులు కాలక్షేపం చేస్తున్నారు. ఆ సమయంలో మల్లేష్ (హండిమల్ల), సాయి, శరణప్ప అనే ముగ్గురు నిందుతులు వారి దగ్గరికి వెళ్లి డబ్బులు ఇవ్వాలని బెదిరించారు.
Three convicts sentenced to death for gang rape of israeli tourist, near Hampi, Karnataka. The convicts have been identified as Mallesh alias Handimalla, Charan Sai, and Sharananasavaraj. https://t.co/C0y1hWWOrQ pic.twitter.com/vLLkmLc32O
— Mohammed Zubair (@zoo_bear) February 16, 2026
పర్యాటకులు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో, ఆ ముగ్గురు కిరాతకులు ముగ్గురు పురుష పర్యాటకులను బలవంతంగా కాలువలోకి నెట్టేశారు. అనంతరం ఇద్దరు మహిళలపై దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. కాలువలో పడ్డ వారిలో ఇద్దరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరి ప్రాణాలు కాపాడుకోగా, ఒడిశాకు చెందిన మరో పర్యాటకుడు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది.
కేసును విచారించిన గంగావతి జిల్లా సెషన్స్ కోర్టు, నిందితులపై ఉన్న రేప్, హత్య అభియోగాలను నిర్ధారించింది. పర్యాటక ప్రాంతంలో విదేశీయులపై ఇటువంటి దారుణానికి ఒడిగట్టడం వల్ల దేశ ప్రతిష్ట దెబ్బతింటుందని, ఇలాంటి మృగాళ్లకు సమాజంలో చోటు లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది.
