తెలుగు రాష్ట్రాల్లో పాతికేళ్ల క్రితం పెను సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసు ఎట్టకేలకు ఒక ముగింపుకు వచ్చింది. ఈ కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం (ఫిబ్రవరి 17, 2026) కొట్టేసింది. గతంలో హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను అత్యున్నత న్యాయస్థానం సమర్థించడమే కాకుండా, నిందితుడు వెంటనే పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది.
నటి ప్రత్యూష, సిద్ధార్థ రెడ్డి ఇంటర్ నుంచి ప్రేమించుకున్నారు. అయితే వీరి పెళ్లికి సిద్ధార్థ రెడ్డి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో, 2002 ఫిబ్రవరి 23న ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగారు. ఈ ఘటనలో ప్రత్యూష మరణించగా, సిద్ధార్థ రెడ్డి చికిత్స తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు. సీబీఐ దర్యాప్తులో ఇది ఆత్మహత్యకు ప్రేరేపించడం (సెక్షన్ 306) అని తేలింది.
2004లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు సిద్ధార్థ రెడ్డికి 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2011లో సిద్ధార్థ రెడ్డి అప్పీలుపై విచారణ జరిపిన హైకోర్టు, ఆ శిక్షను 2 ఏళ్లకు తగ్గించి, రూ. 50 వేల జరిమానా విధించింది. 2012లో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థ రెడ్డి (శిక్ష రద్దు కోసం), ప్రత్యూష తల్లి సరోజినీ దేవి (శిక్ష పెంచాలని) సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
గత ఏడాది నవంబర్‌లో వాదనలు పూర్తి చేసుకున్న జస్టిస్ రాజేష్ బిందల్, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం నేడు తుది తీర్పును వెలువరించింది. సిద్ధార్థ రెడ్డిపై మోపబడిన అభియోగాలు సాక్ష్యాధారాలతో నిరూపితమయ్యాయని పేర్కొంటూ, హైకోర్టు ఇచ్చిన రెండేళ్ల శిక్షను సమర్థించింది. దీంతో సిద్ధార్థ రెడ్డి తన మిగిలిన శిక్షా కాలాన్ని అనుభవించడానికి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.
Big Breaking: ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
