UP Umpire : క్రికెట్ గ్రౌండ్‌లో ఘోరం.. తేనెటీగల దాడిలో అంపైర్ మృతి!

UP Umpire

UP Umpire : క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా ఒక ఊహించని విషాదం జరిగింది. ఆడుతూ పాడుతూ గడపాల్సిన మైదానంలోకి ఒక్కసారిగా తేనెటీగలు దూసుకొచ్చాయి. ఈ దాడిలో ఒక సీనియర్ అంపైర్(UP Umpire) ప్రాణాలు కోల్పోగా, పలువురు చిన్నారి ఆటగాళ్లు గాయపడ్డారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో జరిగింది.

బుధవారం సాయంత్రం ఒక స్టేడియంలో చిన్న పిల్లల (అండర్-13) క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆటగాళ్లంతా ఉత్సాహంగా ఆడుతున్నారు. రెండో ఇన్నింగ్స్ సమయంలో ప్లేయర్స్ నీళ్లు తాగుతుండగా, ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు కానీ వేల సంఖ్యలో తేనెటీగలు గ్రౌండ్‌లోకి వచ్చాయి. అవి కనిపించిన వెంటనే ఆటగాళ్లంతా ప్రాణాలు కాపాడుకోవడానికి నేలపై పడుకున్నారు.

అయితే, అంపైర్‌గా ఉన్న 60 ఏళ్ల మాణిక్ గుప్తాని తేనెటీగలు వదల్లేదు. ఆయన శరీరం నిండా వందల సంఖ్యలో కుట్టేశాయి. దీంతో ఆయన అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయారు. ఆయనతో పాటు మరో 20 మంది చిన్నారి ప్లేయర్లు కూడా తేనెటీగల కాటుకు గురయ్యారు. దీంతో స్టేడియం అంతా భయం భయంగా మారిపోయింది.

వెంటనే మాణిక్ గుప్తాని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, మొదట వెళ్లిన రెండు ఆసుపత్రుల్లో డాక్టర్లు ఎవరూ లేకపోవడంతో పరిస్థితి విషమించింది. చివరికి పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు ఆయన కన్నుమూశారు. మాణిక్ గుప్తా చాలా ఏళ్లుగా అంపైర్‌గా పనిచేస్తున్నారు. ఆయన మరణవార్త విని తోటి అంపైర్లు, ఆటగాళ్లు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒక క్రికెట్ మ్యాచ్‌లో ఇలాంటి వింతైన, బాధాకరమైన ఘటన జరగడం ఇదే మొదటిసారి అని అందరూ అనుకుంటున్నారు.