Sperm Count Test : సంతానలేమి సమస్యతో ఫెర్టిలిటీ సెంటర్‌కు వెళ్ళినప్పుడు పురుషులకు మొదట చేసే పరీక్ష సెమెన్ అనాలిసిస్ (Semen Analysis). అయితే, రిపోర్టు చేతికి రాగానే అందులో ఉండే ఒలిగోస్పెర్మియా, మోటిలిటీ వంటి ఇంగ్లీష్ పదాలు చూసి చాలామంది కంగారు పడుతుంటారు. అసలు ఆ రిపోర్టులో ఏముంది? డాక్టర్లు ఏ అంశాలను బట్టి మీ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని అంచనా వేస్తారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
కౌంట్ అంటే ఏంటి? ఎంత ఉండాలి?
రిపోర్టులో మీరు మొదట చూడాల్సింది ‘స్పెర్మ్ కాన్సంట్రేషన్’ లేదా ‘కౌంట్’. ఒక మిల్లీలీటర్ వీర్యంలో ఎన్ని మిలియన్ల కణాలు ఉన్నాయో ఇది చెబుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ఒక మిల్లీలీటర్ వీర్యంలో కనీసం 15 మిలియన్ల కణాలు ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే దానిని ‘ఒలిగోస్పెర్మియా’ (Oligospermia) అంటారు. ఒకవేళ కణాలు అస్సలు లేకపోతే దానిని ‘అజూస్పెర్మియా’ (Azoospermia) అంటారు. కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు గర్భం దాల్చే అవకాశాలు తగ్గుతాయి.
కదలిక (Motility) చాలా ముఖ్యం:
కేవలం కణాలు ఉంటే సరిపోదు, అవి వేగంగా ఈదుకుంటూ వెళ్లి అండాన్ని చేరుకోవాలి. దీనినే ‘మోటిలిటీ’ అంటారు. మీ రిపోర్టులో ‘ప్రోగ్రెసివ్ మోటిలిటీ’ (Progressive Motility) కనీసం 32% నుండి 40% ఉండాలి. అంటే వంద కణాలలో కనీసం 40 కణాలు చురుగ్గా ముందుకు కదులుతూ ఉండాలి. కణాలు ఉన్నప్పటికీ అవి కదలకుండా ఒకే చోట ఉంటే దానిని ‘అస్తెనోజూస్పెర్మియా’ (Asthenozoospermia) అంటారు. దీనివల్ల కూడా సంతాన సమస్యలు తలెత్తుతాయి.
కణాల సంఖ్య, కదలికతో పాటు వాటి ఆకారం కూడా ముఖ్యమే. కణానికి తల, తోక సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసేదే మార్ఫాలజీ. కనీసం 4% కణాలు సరైన ఆకారంలో ఉండాలి. ఆకారం సరిగ్గా లేని కణాలను ‘టెరాటోజూస్పెర్మియా’ (Teratozoospermia) అంటారు. అలాగే, వీర్యం బయటకు వచ్చిన 20- లేదా 30 నిమిషాల్లో ద్రవంగా మారాలి (Liquefaction). దీనికి ఎక్కువ సమయం పడుతుందంటే శరీరంలో ఏదైనా ఇన్‌ఫెక్షన్ ఉందని అర్థం.
ఈ పరీక్షకు వెళ్లే ముందు కనీసం 2 నుండి 5 రోజుల పాటు భార్యాభర్తలు కలవకుండా ఉండాలి. అలాగని వారం పది రోజులు గ్యాప్ ఇస్తే కణాల నాణ్యత తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఒక్క రిపోర్టులో తేడాలు వచ్చినంత మాత్రాన భయపడాల్సిన పనిలేదు. మీరు పరీక్ష చేయించుకునే సమయానికి మీకు జ్వరం ఉన్నా లేదా విపరీతమైన ఒత్తిడిలో ఉన్నా రిపోర్టు తప్పుగా రావచ్చు. అందుకే డాక్టర్లు రెండు మూడు వారాల తర్వాత మరోసారి పరీక్ష చేయించుకోమని సలహా ఇస్తుంటారు.
