Tirumala : కలియుగ వైకుంఠం తిరుమలలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి ఉన్న ఓ భక్తురాలిని పాము కాటేయడం భయాందోళనకు గురిచేసింది. తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాకు చెందిన మౌనిక అనే భక్తురాలు ఆదివారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్‌లో నిలబడ్డారు.
ఆ సమయంలో ఒక్కసారిగా పాము ఆమెను కాటేసింది. వెంటనే అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది ఆమెను తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ప్రస్తుతం మౌనిక పూర్తిగా కోలుకుని తన స్వస్థలానికి వెళ్లారని టీటీడీ సీపీఆర్వో అధికారిక ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఇక ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 15 గంటల సమయం పడుతోంది. మరోవైపు మే నెలకు సంబంధించిన దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఈరోజే ఆన్‌లైన్‌లో విడుదల చేస్తోంది.
ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల కానుండగా, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు మరియు దివ్యాంగుల కోటా టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. భక్తులు ఈ అవకాశాన్ని గమనించి అధికారిక వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
