PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోడీ మరో అరుదైన మైలురాయిని చేరుకుని గ్లోబల్ లీడర్‌గా తన సత్తా చాటారు. కేవలం రాజకీయాల్లోనే కాదు, సోషల్ మీడియా ప్రపంచంలో కూడా తనకు తిరుగులేదని నిరూపిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్ల (10 కోట్లు) ఫాలోవర్ల మార్కును దాటారు. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే తొలి దేశాధినేతగా మోడీ(PM Modi) సరికొత్త చరిత్ర సృష్టించారు.
2014లో ఇన్‌స్టాగ్రామ్ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన, పదేళ్ల కాలంలోనే ఇంతటి భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకోవడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర అగ్రనేతలతో పోలిస్తే మోడీ ఫాలోయింగ్ చాలా రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు 43 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా, వారి కంటే రెట్టింపు కంటే ఎక్కువ ఫాలోయింగ్‌తో మోడీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా వంటి నేతలందరి ఫాలోవర్ల సంఖ్యను కలిపినా మోడీ దరిదాపుల్లోకి కూడా రాలేదు. భారత దేశంలో కూడా ఇతర రాజకీయ నేతల కంటే ఆయన ఎంతో ఎత్తులో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వంటి వారు మోడీ తర్వాత స్థానాల్లో నిలిచారు.
తన పర్యటనలు, సామాన్యులతో మమేకమయ్యే ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ యువతకు దగ్గరవ్వడమే ఆయన ఈ స్థాయి రికార్డు సృష్టించడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
