Plastic bottles: మనం దాహం వేసినప్పుడల్లా ఎంతో హాయిగా తాగే ప్లాస్టిక్ బాటిల్ నీళ్లు మన సంతాన సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ బాటిళ్ల తయారీలో వాడే బిస్ ఫినాల్-A (BPA) అనే రసాయనం నేరుగా పురుషుల హార్మోన్ల మీద ప్రభావం చూపుతుంది. మనం ఎండలో ఉన్నప్పుడు లేదా బాటిల్ వేడెక్కినప్పుడు ఆ ప్లాస్టిక్‌లోని కెమికల్స్ నీటిలో కలుస్తాయి.
ఆ నీటిని మనం తాగినప్పుడు, అవి శరీరంలోని ఎండోక్రిన్ వ్యవస్థను దెబ్బతీసి టెస్టోస్టెరాన్ వంటి ముఖ్యమైన హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఇది నేరుగా వీర్యకణాల సంఖ్య (Sperm Count) పడిపోవడానికి కారణమవుతోంది.
తాజా అధ్యయనాల ప్రకారం, ప్లాస్టిక్ కాలుష్యం వల్ల పురుషులలో వీర్యకణాల నాణ్యత గత కొన్నేళ్లుగా దారుణంగా పడిపోతోంది. ప్లాస్టిక్‌లో ఉండే ఈ మైక్రో కెమికల్స్ శరీరంలోకి చేరినప్పుడు అవి వీర్యకణాల ఆకృతిని మార్చడమే కాకుండా, వాటి కదిలే సామర్థ్యాన్ని (Motility) కూడా తగ్గిస్తాయి.
దీనివల్ల సహజ పద్ధతిలో గర్భం దాల్చే అవకాశాలు క్లిష్టంగా మారుతున్నాయి. కేవలం బాటిల్స్ మాత్రమే కాదు, ప్లాస్టిక్ డబ్బాల్లో ఆహారాన్ని వేడి చేయడం, ప్లాస్టిక్ కవర్లలో వేడి టీ తాగడం కూడా పురుషత్వాన్ని దెబ్బతీసే అంశాలేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తండ్రి కావాలని ఆశపడే యువత ప్లాస్టిక్ బాటిళ్లకు బదులుగా స్టీల్ లేదా గాజు బాటిళ్లను వాడటం ఉత్తమమని సూచిస్తున్నారు.
