BIG BREAKING : సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. కలెక్టర్ల నుంచి సెక్రటరీల దాకా అందరూ అవుట్!

BIG BREAKING

BIG BREAKING : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక్కసారిగా ఏకంగా 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ముఖ్యంగా కీలకమైన పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఐటీ, ఫైనాన్స్ శాఖలతో పాటు పలు జిల్లాల కలెక్టర్లను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో సీనియర్ అధికారులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు యువ ఐఏఎస్ అధికారులకు కీలకమైన జిల్లా బాధ్యతలను అప్పగించడం గమనార్హం.

ఈ భారీ బదిలీల్లో భాగంగా పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్‌గా సంజయ్ కుమార్, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఈ. శ్రీధర్, ఐటీ శాఖ బాధ్యతలను ఎన్. శ్రీధర్ చేపట్టనున్నారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బాధ్యతలను దాన కిషోర్‌కు అప్పగించగా, ఫైనాన్స్ శాఖ సెక్రటరీగా గౌరవ్ ఉప్పల్‌ను నియమించింది. విద్యుత్ రంగంలో కూడా కీలక మార్పులు చేస్తూ SPDCL సీఎండీగా జితేశ్ వి. పాటిల్‌ను, కొత్త డిస్కం సీఎండీగా ముషారఫ్ ఫారూకీని నియమించింది.

జిల్లా కలెక్టర్ల విషయానికి వస్తే.. మహబూబ్‌నగర్, కరీంనగర్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి, జనగాం వంటి జిల్లాలకు కొత్త సారథులు వచ్చారు. అలాగే గద్వాల, మహబూబాబాద్, సిరిసిల్ల, వికారాబాద్, మెదక్ జిల్లాల కలెక్టర్లను మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ట్రైబల్ వెల్ఫేర్, లేబర్, కోఆపరేటివ్ వంటి ప్రజా సంబంధిత శాఖలకు కొత్త అధికారులను నియమించడం ద్వారా సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

కీలక బాధ్యతల విషయానికి వస్తే.. ఫైనాన్స్ శాఖ స్పెషల్ సెక్రటరీగా సిక్తా పట్నాయక్, ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా బి.ఎం. సంతోష్ నియామకమయ్యారు. లేబర్ స్పెషల్ కమిషనర్‌గా పమేలా సత్పతి, కోఆపరేటివ్ కమిషనర్‌గా పి.ఎస్. రాహుల్ రాజ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక జిల్లాల వారీగా చూస్తే.. జోగులాంబ గద్వాలకు రిజ్వాన్ బాషా షేక్, మహబూబాబాద్‌కు స్నేహ శబర్ష్, రాజన్న సిరిసిల్లకు గరిమా అగర్వాల్ కొత్త కలెక్టర్లుగా రానున్నారు.

అలాగే వికారాబాద్‌కు దీపక్ తివారీ, మెదక్ జిల్లా కలెక్టర్‌గా ప్రతిమా సింగ్ బాధ్యతలు స్వీకరించనుండగా.. మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్‌గా ఫైజాన్ అహ్మద్, వికారాబాద్ అదనపు కలెక్టర్‌గా ఉమా శంకర్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ భారీ బదిలీలతో తెలంగాణ బ్యూరోక్రసీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.