Telangana: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు మరో నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయి, ఏం చేయాలో పాలుపోక ఒక యువకుడు తనువు చాలించిన ఘటన జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన 37 ఏళ్ల గర్వందుల మహేష్, వృత్తిరీత్యా గీత కార్మికుడు. భార్య జమున, ఇద్దరు ఆడపిల్లలతో కలిసి సాఫీగా సాగుతున్న అతని జీవితంలోకి ఏడాది క్రితం బెట్టింగ్ యాప్స్ ప్రవేశించాయి.
మొదట్లో సరదాగా మొదలైన ఈ వ్యసనం, మెల్లమెల్లగా అతన్ని బానిసగా మార్చేసింది. పోగొట్టుకున్న డబ్బును ఎలాగైనా తిరిగి సంపాదించాలనే ఆరాటంతో తెలిసిన వారందరి దగ్గర అప్పులు చేసి మరీ బెట్టింగ్ ఆడేవాడు. అలా చూస్తుండగానే అప్పుల మొత్తం సుమారు 25 లక్షల రూపాయలకు చేరింది. అంత పెద్ద మొత్తాన్ని ఎలా తీర్చాలో తెలియక, అప్పుల వారి ఒత్తిడి తట్టుకోలేక మహేష్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.
చివరకు బుధవారం రాత్రి గ్రామం శివార్లలోని రైతు వేదిక వద్దకు వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఒక చిన్న వ్యసనం వల్ల ఇద్దరు ఆడపిల్లలు తండ్రిని కోల్పోయి అనాథలవ్వడం స్థానికులను కలచివేస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
