Vishnu Vinyasam Review: నవ్వులు ఓకే కానీ, విన్యాసం మామూలే!

Vishnu Vinyasam

Vishnu Vinyasam Review:  శ్రీ విష్ణు సినిమా అంటేనే మినిమం గ్యారెంటీ నవ్వులు ఉంటాయని ఆడియన్స్ ఫిక్స్ అయిపోతారు. కొత్తదనం ఉన్నా లేకున్నా, ఉన్నంతలో హాయిగా నవ్వుకోవచ్చనే నమ్మకంతో థియేటర్‌కు వెళ్తుంటారు. ‘విష్ణు విన్యాసం’ విషయంలో కూడా అదే జరిగింది. అక్కడక్కడా పేలిన కామెడీ పంచులు మినహా, సినిమా పరంగా ఇది యావరేజ్‌గానే నిలిచింది.

దర్శకుడు యధునాధ్ మారుతిరావు ఇంటర్వెల్ వరకు కథను చాలా గ్రిప్పింగ్‌గా నడిపించారు. హీరోయిన్‌కు ఒక సమస్యను ముడిపెట్టి, కథలో మంచి సస్పెన్స్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. అయితే, ఆ ట్విస్ట్ ఏంటో రివీల్ అయిన తర్వాతే అసలు సమస్య మొదలైంది. సెకండాఫ్ అంతా ఒకే చోట తిరుగుతున్నట్లు అనిపించడంతో పాటు, కథనం చాలా నెమ్మదిగా సాగింది. క్లైమాక్స్‌లో ఇచ్చే ట్విస్ట్ కూడా ముందే ఊహించేలా ఉండటంతో ప్రేక్షకుడికి పెద్దగా కిక్ ఇవ్వదు.

హీరో శ్రీ విష్ణు తన వంతుగా సినిమాను భుజాన వేసుకునే ప్రయత్నం చేశారు. గ్యాప్ దొరికితే చాలు దూరిపోయి మరీ కామెడీ పండించారు. ముఖ్యంగా ఆయన సిగ్నేచర్ స్టైల్ అయిన ‘మర్మరింగ్’ (గునుక్కుంటూ మాట్లాడటం) ఈ సినిమాలో కూడా బాగా వర్కవుట్ అయ్యింది. ఆయన చెప్పే వన్ లైనర్లు కొన్ని చోట్ల బాగా మెప్పించాయి. ఇక హీరోయిన్ నయన్ సారిక పర్వాలేదనిపించగా, కమెడియన్ సత్య తనదైన శైలిలో నవ్వులు పూయించారు.

దర్శకుడు యధునాధ్ మారుతిరావుకు శ్రీ విష్ణు లాంటి ‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్మెంట్’ దొరికినా, దాన్ని పూర్తిస్థాయిలో వాడుకోవడంలో తడబడ్డారు. ఫస్టాఫ్‌లో ఉన్న పట్టు సెకండాఫ్‌లో కనిపించలేదు. కథలో మేటర్ బయటపడ్డాక సాగదీత ఎక్కువగా అనిపించింది.

ఓవరాల్‌గా చెప్పాలంటే.. ‘విష్ణు విన్యాసం’ కేవలం కొన్ని నవ్వులకే పరిమితమైంది. శ్రీ విష్ణు మార్క్ కామెడీ కోసం ఒకసారి చూడొచ్చు కానీ, ఓ గ్రిప్పింగ్ సినిమాగా మాత్రం ఇది మెప్పించలేకపోయింది. ఇది ఒక సాధారణ విన్యాసమే!