Delhi Excise Policy case : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో(Delhi Excise Policy case) అనూహ్య మలుపు చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు మొత్తం 23 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి జితేంద్ర ప్రతాప్ సింగ్( Judge Jitendra Pratap Singh) సంచలన తీర్పునిచ్చారు. దాదాపు 598 పేజీల ఈ తీర్పులో దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ తీరుపై జడ్జి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అసలు ఆధారాలు లేకుండా, కేవలం అభూతకల్పనలతో, తప్పుడు సాక్ష్యాధారాల ఆధారంగా ఛార్జ్ షీట్ రూపొందించారని ఆయన విమర్శించారు. దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థకు కనీస అక్షర జ్ఞానం కూడా లేదని జడ్జి వ్యాఖ్యానించడం ఇప్పుడు న్యాయ మరియు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ తీర్పును వెలువరించిన జడ్జి గురించి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన పేరు జితేంద్ర ప్రతాప్ సింగ్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పూర్తి చేసి, ఢిల్లీ జ్యుడీషియల్ సర్వీసెస్‌లో సీనియర్ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన సుదీర్ఘ కాలం పాటు సీనియర్ జ్యుడీషియల్ ఆఫీసర్‌గా పనిచేసి, సంక్లిష్టమైన కేసులను డీల్ చేయడంలో మంచి అనుభవాన్ని గడించారు. చట్టం ముందు అందరూ సమానమే అనే సూత్రాన్ని పాటిస్తూ, దర్యాప్తు సంస్థల వైఫల్యాలను ఎత్తిచూపడంలో ఆయన వెనుకాడలేదు.
2024లో ఢిల్లీ హైకోర్టు 200 మందికి పైగా న్యాయ అధికారులను బదిలీ చేసినప్పుడు ఆయన రౌస్ అవెన్యూ కోర్టులకు బదిలీ చేయబడ్డారు. 2024 అక్టోబర్ నుంచి రౌస్ అవెన్యూ కోర్టులో అదనపు సెషన్స్ జడ్జిగా కొనసాగుతున్న ఆయన, ఎటువంటి ప్రలోభాలకు లొంగని నిక్కచ్చి వ్యక్తిగా గుర్తింపు పొందారు.
ఈ కేసు విషయంలో సీబీఐ కేవలం అప్రూవర్ల మాటలనే వేదంగా భావించిందని, కనీస నిర్మాణాత్మక సాక్ష్యాలు లేకుండా కథలు అల్లిందని ఆయన ఆక్షేపించారు. ఇలాంటి దర్యాప్తు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేస్తూ, దర్యాప్తు సరిగ్గా చేయని సీబీఐ అధికారులపైనే శాఖాపరమైన విచారణకు జడ్జి ఆదేశించడం విశేషం. మొత్తం మీద, ఈ తీర్పుతో మద్యం కేసులో నిందితులుగా ఉన్న వారందరికీ ఊరట లభించినట్లయింది.
