POMIS Scheme : నెలకు రూ. 9,250 ఆదాయం.. పైసా రిస్క్ లేని అదిరిపోయే స్కీమ్!

POMIS Scheme

POMIS Scheme : పెట్టుబడి పెట్టే ప్రతి ఒక్కరూ కోరుకునేది ఒకటే.. పెట్టిన డబ్బు సురక్షితంగా ఉండాలి, దానిపై వచ్చే లాభం ఎక్కువగా ఉండాలి. సాధారణంగా ఎక్కువ లాభం రావాలంటే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టాలి. కానీ అక్కడ రిస్క్ చాలా ఎక్కువ, మార్కెట్ ఒడిదుడుకులతో ఎప్పుడు ఏమవుతుందో ఎవరూ చెప్పలేరు. ఇక బ్యాంక్ ఎఫ్‌డీల (FD) విషయానికి వస్తే, మంచి లాభం రావాలంటే చాలా కాలం వేచి చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా రిటైర్మెంట్ వయసులో ఉన్నవారికి చేతికి ప్రతి నెలా కొంత డబ్బు అందేలా ఉండే స్థిర ఆదాయం ఇచ్చే పథకాలు చాలా అవసరం. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఒక అద్భుతమైన ఆయుధమే ‘పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్’ (POMIS).

ఈ పథకం వెనుక భారత ప్రభుత్వం ఉండటం వల్ల ఇందులో మీ పైసాకు కూడా రిస్క్ ఉండదు. గ్యారెంటీగా ప్రతి నెలా మీ చేతికి ఆదాయం అందుతుందనే భరోసా ఈ స్కీమ్ ప్రత్యేకత. అందుకే రిస్క్ తీసుకోలేము అనుకునే మధ్యతరగతి ప్రజలకు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇది ఒక గొప్ప వరంలా మారింది. ప్రస్తుతం ఈ పథకంలో పెట్టుబడి పెడితే ఏకంగా 7.4 శాతం వరకు వడ్డీని పొందవచ్చు. ఒకేసారి చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి ఐదేళ్ల పాటు ప్రతి నెలా ఆదాయం పొందే సదుపాయం ఇందులో ఉంది.

పెట్టుబడి పరిమితుల విషయానికి వస్తే, ఒక వ్యక్తి తన పేరు మీద గరిష్టంగా 9 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అదే భార్యాభర్తలు కలిసి జాయింట్ అకౌంట్ తీసుకుంటే ఏకంగా 15 లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మీ అకౌంట్‌లో జమ అయ్యే నెలవారీ వడ్డీని అప్పుడప్పుడు డ్రా చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మీరు ఆ వడ్డీని అలాగే వదిలేసినా, దానిపై మళ్లీ అదనపు వడ్డీ రాదని పోస్ట్ ఆఫీస్ నిబంధనలు చెబుతున్నాయి.

ఇక అందరూ ఆశించే నెలకు రూ. 9,250 ఆదాయం ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ గరిష్ట ఆదాయాన్ని పొందాలంటే మీరు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అందులో ఈ పథకానికి అనుమతించిన గరిష్ట పరిమితి అయిన 15 లక్షల రూపాయలను ఒకేసారి డిపాజిట్ చేయాలి. ఇలా చేయడం వల్ల ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం మీకు నెలకు రూ. 9,250 వడ్డీ రూపంలో వస్తుంది. అంటే ఏడాదికి సుమారుగా 1.10 లక్షల రూపాయల ఆదాయం మీ సొంతం అవుతుందన్నమాట. ఐదేళ్ల కాల పరిమితి ముగిసిన తర్వాత మీ 15 లక్షల అసలు మీకు తిరిగి అందుతుంది.

చాలామంది స్టాక్ మార్కెట్లలో లేదా మ్యూచువల్ ఫండ్లలో 15 లక్షలు పెడితే ఇంతకంటే ఎక్కువ లాభం వస్తుంది కదా అని వాదించవచ్చు. అది నిజమే కావొచ్చు కానీ, అక్కడ అసలుకే మోసం వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది. కానీ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో మీ పెట్టుబడికి పూర్తి రక్షణ ఉంటుంది. కేవలం ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్, కేంద్ర ప్రభుత్వ భరోసా, ఆకర్షణీయమైన వడ్డీ రేటు వెరసి.. తమ రిటైర్మెంట్ ఫండ్‌ను ఎక్కడ దాచుకోవాలో అని ఆలోచించే వారికి ఇది ఒక అత్యుత్తమ మార్గం. స్థిరమైన ఆదాయం కోసం చూస్తున్న వారికి ఈ పథకం ఒక బంగారు బాట అని చెప్పవచ్చు.