Today Gold Rate : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. కొనే దమ్ముందా?

gold and silver rates today

Today Gold Rate :గల్ఫ్ దేశాల్లో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ మార్కెట్లను వణికిస్తున్నాయి. ప్రధానంగా పసిడి, వెండి ధరలు (Today Gold and silver Rates)మునుపెన్నడూ లేని విధంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల వల్ల సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు పరుగులు తీస్తుండటంతో, మన దేశీ మార్కెట్‌లో ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

ఇవాళ ఒక్కరోజే పసిడి ధరలు ఊహించని రీతిలో పెరిగాయి. తులం బంగారంపై ఏకంగా రూ. 4,000 పెరగడంతో కొనుగోలుదారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తాజా పెంపుతో 24 క్యారెట్ల (10 గ్రాముల) స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,68,710 కి చేరింది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,54,650 వద్ద కొనసాగుతోంది. శుభకార్యాల సీజన్‌లో ఈ స్థాయిలో ధరలు పెరగడం సామాన్య, మధ్యతరగతి ప్రజలకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి.

బంగారం ఒకెత్తయితే, వెండి ధరలు మాత్రం ఏకంగా సునామీని సృష్టించాయి. కేవలం ఒక్క రోజులోనే కిలో వెండిపై రూ. 25,000 పెరగడం మార్కెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన పరిణామం. దీంతో కిలో వెండి ధర రూ. 3 లక్షల మార్కును దాటి ఏకంగా రూ. 3,20,000 కు చేరుకుంది. పారిశ్రామిక అవసరాలు పెరగడం, గల్ఫ్ యుద్ధం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతింటుందనే భయాలు వెండి ధరను ఈ స్థాయికి చేర్చాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

యుద్ధం ఆగే వరకు ధరలు దిగిరావా?

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టనంత వరకు బులియన్ మార్కెట్‌లో ఈ వేడి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రూపాయి విలువ పతనం కావడం, కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని నిల్వ చేసుకోవడం కూడా ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యులు బంగారం షాపుల వైపు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ ధరల పెరుగుదల ఇక్కడితో ఆగుతుందా లేక మరిన్ని రికార్డులను తిరగరాస్తుందా అనేది వేచి చూడాల్సిందే.