Ahmad Vahidi : ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆ దేశం తన సైనిక వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది. ఇరాన్ అత్యంత శక్తివంతమైన సైనిక విభాగం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కొత్త చీఫ్‌గా అహ్మద్ వాహిదీని నియమించింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మాజీ చీఫ్ మహమ్మద్ పక్పూర్ మరణించడంతో, ఆ బాధ్యతలను అత్యంత అనుభవజ్ఞుడైన వాహిదీకి అప్పగించారు.
అహ్మద్ వాహిదీ (67) ఇరాన్ సైనిక, రాజకీయ వ్యవస్థలో ఒక కీలకమైన వ్యక్తి. ఆయన కేవలం ఒక సైనికాధికారి మాత్రమే కాదు, ఇరాన్ వ్యూహాలకు పదును పెట్టే మేధావిగా పేరుగాంచారు.
ఇరాన్ వెలుపల రహస్య ఆపరేషన్లు నిర్వహించే అత్యంత ప్రమాదకరమైన ‘ఖుద్స్ ఫోర్స్’ (Quds Force) కు ఈయనే మొదటి కమాండర్ (1988-1998). విదేశాల్లో ఇరాన్ అనుకూల గ్రూపులను తయారు చేయడంలో ఈయనది అందెవేసిన చేయి.
గతంలో ఇరాన్ రక్షణ మంత్రిగా (2009-2013), అంతర్గత వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేశారు. ఇరాన్ అణు కార్యక్రమం, క్షిపణి వ్యవస్థల అభివృద్ధిలో ఈయన పాత్ర చాలా కీలకం. 1994లో అర్జెంటీనాలోని యూదు సాంస్కృతిక కేంద్రంపై జరిగిన బాంబు దాడిలో ఈయనకు సంబంధం ఉందన్న ఆరోపణలతో ఇంటర్‌పోల్ ఈయనపై ‘రెడ్ నోటీసు’ కూడా జారీ చేసింది.
వాహిదీ నియామకం జరిగిన వెంటనే ఇరాన్ తన పంథాను మార్చుకుంది. “శత్రువు ఎన్నడూ చూడని రీతిలో అత్యంత భయంకరమైన ప్రతిదాడి ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి” అని IRGC హెచ్చరించింది.
ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే, యుద్ధం కేవలం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్యే కాకుండా గల్ఫ్ దేశాలన్నిటికీ పాకినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే దుబాయ్‌లోని బుర్జ్ అల్ అరబ్ హోటల్ సమీపంలో డ్రోన్ శకలాలు పడటం, బహ్రెయిన్ విమానాశ్రయంపై దాడులు జరగడం చూస్తుంటే, వాహిదీ నేతృత్వంలో ఇరాన్ అమెరికా మిత్రదేశాలను, వారి సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టమవుతోంది.
