West Bengal Governor : పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి. ఆనంద బోస్ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సుమారు మూడున్నర ఏళ్ల పాటు గవర్నర్‌గా సేవలు అందించిన ఆయన గురువారం తన రాజీనామాను సమర్పించారు.
కేరళ క్యాడర్‌కు చెందిన 1977 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన ఆనంద బోస్ 2022 నవంబర్ 23న బెంగాల్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు లా గణేషన్ స్థానంలో ఆయనను కేంద్రం నియమించింది. 2011లో ఐఏఎస్ అధికారిగా పదవీ విరమణ చేసిన ఆయన గతంలో కోల్‌కతాలోని నేషనల్ మ్యూజియం అడ్మినిస్ట్రేటర్‌గా కూడా పనిచేశారు.
ఆనంద బోస్ కేవలం పరిపాలనా అధికారిగానే కాకుండా మంచి రచయితగా కూడా పేరు తెచ్చుకున్నారు. ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ ఫెలోషిప్ అందుకున్న ఆయన ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఫెలోషిప్ పొందిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు.
తొమ్మిది భాషల్లో సుమారు 70 పుస్తకాలతో పాటు మొత్తం 350 ప్రచురణలు ఆయన పేరు మీద ఉన్నాయి. నవలలు, కథలు, కవితలు, వ్యాసాల రూపంలో ఆయన సాహితీ సేవ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన రాజీనామా చేయడం వెనుక గల కారణాలు, తదుపరి గవర్నర్ ఎవరనే విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
