BIG BREAKING : తెలంగాణలో హోటల్స్ బంద్!

telangana hotels

BIG BREAKING : తెలంగాణలో హోటల్ రంగం ఇప్పుడు పెను సంక్షోభంలో కూరుకుపోయింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు సరఫరాలో ఏర్పడిన ఆటంకాలు నేరుగా ఇక్కడి హోటల్స్ పై ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని చాలా హోటళ్లకు కమర్షియల్ ఎల్‌పీజీ (LPG) సరఫరా దాదాపుగా నిలిచిపోయింది.

దీంతో గ్యాస్ నిల్వలు నిండుకోవడంతో మరో రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా హోటల్స్ అన్నింటినీ మూసివేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని యజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో హోటల్స్ బంద్ కావడంతో, అదే పరిస్థితి హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర పట్టణాల్లోనూ కనిపిస్తోంది. గ్యాస్ సరఫరా పునరుద్ధరించకపోతే హోటల్స్ ఆటోమేటిక్‌గా క్లోజ్ అవుతాయని, వంటలు చేయడం అసాధ్యమని వారు స్పష్టం చేస్తున్నారు.

ఈ రంగంపై ఆధారపడి తెలంగాణలో లక్షలాది మంది జీవనోపాధి పొందుతున్నారు. కేవలం హైదరాబాద్‌లోనే వేలాది హోటల్స్, టిఫిన్ సెంటర్లు, మెస్‌లు ఉండగా.. వాటిలో పనిచేసే కార్మికులు, సర్వర్లు, డెలివరీ బాయ్స్ ఇలా దాదాపు 10 లక్షల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ రంగంపైనే ఆధారపడి బతుకుతున్నారు. హోటల్స్ బంద్ అయితే వీరందరి కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉంది.

అంతేకాకుండా, బ్యాచిలర్స్, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు తమ రోజువారీ ఆహారం కోసం హోటల్స్ పైనే ఆధారపడతారు. ఇప్పుడు గ్యాస్ కొరత వల్ల వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ సమస్యను వివరించాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ పరంగా ఏదైనా ప్రత్యామ్నాయం చూపాలని లేదా చమురు సంస్థలతో మాట్లాడి అత్యవసరంగా గ్యాస్ కోటాను కేటాయించాలని కోరనున్నారు.

మరోవైపు, కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ఉత్పత్తిని 10 శాతం పెంచుతామని హామీ ఇచ్చినప్పటికీ, అవి క్షేత్రస్థాయికి చేరడానికి సమయం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకుని హోటల్ రంగాన్ని కాపాడాలని యజమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. హోటల్స్ మూతపడితే అది కేవలం వ్యాపారవేత్తలకే కాకుండా, సామాన్య ప్రజల ఆహార భద్రతపై కూడా పెద్ద దెబ్బ తీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.