Post Office Scheme : పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే ఆఫర్: రూ. 2 లక్షలు దాచుకుంటే.. వడ్డీయే రూ. 90 వేలు!

post office

Post Office Scheme : భద్రతతో పాటు గ్యారెంటీ ఆదాయం కోరుకునే వారికి పోస్ట్ ఆఫీస్ పథకాలు ఎప్పుడూ బెస్ట్ ఛాయిస్. ముఖ్యంగా బ్యాంకుల్లో ఉండే ఎఫ్డీ (FD) మాదిరిగానే ఉండే ‘పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్’ (POTD) పథకం ఇప్పుడు పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ స్కీమ్‌లో కేవలం రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా, కాలపరిమితి ముగిసేసరికి వడ్డీ రూపంలోనే ఏకంగా రూ. 90 వేల వరకు పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ మద్దతు ఉన్న పథకం కావడంతో ఇందులో రిస్క్ అనేది అస్సలు ఉండదు.

ఈ టైమ్ డిపాజిట్ పథకంలో మీరు ఏడు, 2 ఏళ్లు, 3 ఏళ్లు , 5 ఏళ్ల కాలపరిమితితో డబ్బును డిపాజిట్ చేయవచ్చు. అయితే మీరు ఎంచుకునే కాలపరిమితిని బట్టి వడ్డీ రేట్లు మారుతుంటాయి. ఏడాది డిపాజిట్‌కు 6.9 శాతం, రెండు లేదా మూడేళ్ల డిపాజిట్‌కు 7 శాతం వడ్డీ లభిస్తుంది. అదే మీరు ఐదేళ్ల కాలపరిమితిని ఎంచుకుంటే అత్యధికంగా 7.5 శాతం వడ్డీని పొందవచ్చు. ఉదాహరణకు, మీరు రూ. 2 లక్షలను ఐదేళ్ల పాటు ఈ పథకంలో ఉంచితే, 7.5 శాతం వడ్డీ రేటు ప్రకారం మీకు రూ. 89,990 వడ్డీ లభిస్తుంది. అంటే ఐదేళ్ల తర్వాత మీ చేతికి మొత్తం రూ. 2,89,990 అందుతాయి.

ఒకవేళ మీరు పెట్టుబడి మొత్తాన్ని పెంచితే లాభం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే, ఐదేళ్ల తర్వాత వడ్డీతో కలిపి సుమారు రూ. 7,24,974 వస్తాయి. కేవలం వడ్డీయే రూ. 2.25 లక్షల వరకు అందుతుంది. ఈ పథకంలో మరో పెద్ద ప్రయోజనం ఏమిటంటే, ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.

మీరు ఒంటరిగా గానీ లేదా మరొకరితో కలిసి జాయింట్ అకౌంట్ ద్వారా గానీ ఈ పథకంలో చేరవచ్చు. కనీసం రూ. 1,000 తో అకౌంట్ ప్రారంభించే అవకాశం ఉండగా, గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఎక్కువ మొత్తం దాచుకుంటే అంత ఎక్కువ లాభం పొందవచ్చు.