sperm count : పెళ్లై ఎన్ని ఏళ్లయినా పిల్లలు కలగడం లేదని నేడు చాలా మంది దంపతులు మానసిక వేదన అనుభవిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి సమస్య రాగానే అందరూ మహిళల్లోనే లోపం ఉంటుందని భావిస్తారు కానీ మారుతున్న జీవనశైలి వల్ల ప్రస్తుతం యాభై శాతం కేసుల్లో పురుషుల్లోనే లోపాలు ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా పురుషుల్లో వీర్య కణాల సంఖ్య, వాటి కదలిక తక్కువగా ఉండటం వల్ల సంతానం కలగడం ఆలస్యమవుతోంది.
అయితే దీనికి భారీ ఖర్చుతో కూడిన మందులు వాడటానికంటే ముందు మీరు రోజూ చేసే ఒక చిన్న పొరపాటును సరిదిద్దుకోవాలని డాక్టర్లు గట్టిగా హెచ్చరిస్తున్నారు. అదే మీరు వేసుకునే బిగుతైన డ్రాయర్లు. పురుషుల శరీర నిర్మాణం ప్రకారం వీర్య కణాలను ఉత్పత్తి చేసే వృషణాలు శరీరం వెలుపల ఉండటానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. మన శరీర ఉష్ణోగ్రత సుమారు 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది కానీ ఆరోగ్యకరమైన వీర్య కణాలు ఉత్పత్తి అవ్వాలంటే అంతకంటే కనీసం రెండు నుండి మూడు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత ఉండాలి. అంటే ఆ ప్రాంతం ఎప్పుడూ చల్లగా ఉండాలి.
మనం చాలా బిగుతుగా ఉండే డ్రాయర్లు లేదా సింథటిక్ దుస్తులు ధరించినప్పుడు వృషణాలు శరీరానికి హత్తుకుపోయి ఉంటాయి. దీనివల్ల శరీరంలోని వేడి వృషణాలకు తగిలి అక్కడ ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఆ వేడికి వీర్య కణాలు ఉత్పత్తి అవ్వడం ఆగిపోవడమే కాకుండా ఉన్న కణాలు కూడా చనిపోతాయి. దీనినే వైద్య భాషలో హీట్ స్ట్రెస్ అని పిలుస్తారు. కొన్ని రోజుల పాటు లోదుస్తులు వేసుకోకపోవడమే బెటర్ అని చెబుతున్నారు.
కేవలం లోదుస్తులే కాకుండా మన రోజువారీ అలవాట్లు కూడా ఈ వేడిని పెంచుతున్నాయి. చాలా మంది ల్యాప్‌టాప్‌ను నేరుగా ఒడిలో పెట్టుకుని గంటల తరబడి పని చేస్తారు. ల్యాప్‌టాప్ నుండి వచ్చే వేడి నేరుగా వృషణాలపై ప్రభావం చూపి వీర్య కణాలను నాశనం చేస్తుంది. అలాగే గంటల తరబడి బైక్ నడపడం లేదా కారులో కూర్చుని ఉండటం వల్ల కూడా ఆ ప్రాంతంలో గాలి ఆడక వేడి పెరుగుతుంది. వీటికి తోడు అతిగా వేడి నీళ్లతో స్నానం చేయడం లేదా ప్యాంటు జేబులో ఫోన్ ఉంచుకోవడం వల్ల వచ్చే రేడియేషన్ కూడా వీర్య కణాల నాణ్యతను దెబ్బతీస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
పిల్లల కోసం ప్రయత్నించే వారు లేదా వీర్య కణాల సమస్య ఉన్నవారు వెంటనే తమ అలవాట్లలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆఫీసులో గంటల తరబడి కూర్చునే వారు ప్రతి గంటకు ఒకసారి లేచి కాసేపు నడవడం వల్ల ఆ ప్రాంతంలో వేడి తగ్గడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు విటమిన్ సి, ఈ, జింక్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ బరువు అదుపులో ఉంచుకోవాలి. లక్షల రూపాయలు ఖర్చు చేసి ట్రీట్‌మెంట్లు తీసుకునే ముందు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలా వరకు సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయి.
