sperm count : వీర్యం పలుచుగా ఉండాలా.. చిక్కగా ఉండాలా? అసలు నిజం ఇదీ!

sperm count

sperm count :  మగవారిలో చాలా మందికి ఒకటే అనుమానం.. “నా వీర్యం నీళ్లలా పల్చగా ఉంది, నాకు పిల్లలు పుడతారా? లేదా చిక్కగా ఉంటేనే ఆరోగ్యమా?” అని. నిజానికి వీర్యం చిక్కదనం గురించి సోషల్ మీడియాలో వచ్చే వార్తలు చూసి చాలా మంది అనవసరంగా టెన్షన్ పడుతుంటారు. అసలు డాక్టర్లు దీని గురించి ఏమంటున్నారో సింపుల్‌గా తెలుసుకుందాం.

నిజానికి వీర్యం బయటకు వచ్చినప్పుడు కొంచెం చిక్కగా, జెల్లీ లాగా ఉండటం మంచిదే. అలా ఉంటే అందులో వీర్య కణాలు ఎక్కువగా ఉన్నాయని ఒక నమ్మకం. కానీ, వీర్యం చిక్కగా ఉన్నంత మాత్రాన కణాలు ఆరోగ్యంగా ఉన్నాయని గ్యారెంటీ లేదు. అలాగే పల్చగా ఉన్నంత మాత్రాన లోపం ఉన్నట్లు కూడా కాదు. వీర్యం బయటకు వచ్చిన పది పదిహేను నిమిషాల తర్వాత అది నీళ్లలా పల్చగా మారిపోవాలి. అలా మారితేనే అందులోని వీర్య కణాలు వేగంగా ప్రయాణించి గర్భం దాల్చడానికి సహాయపడతాయి.

ఒకవేళ మీ వీర్యం ఎప్పుడూ నీళ్లలాగే వస్తుంటే దానికి కొన్ని కారణాలు ఉండొచ్చు. మీరు సరిగ్గా నీళ్లు తాగకపోయినా, ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నా, లేదా జింక్ అనే పోషకం తక్కువైనా వీర్యం పల్చబడుతుంది. అలాగే రోజుకు ఎక్కువ సార్లు హస్తప్రయోగం చేసినా లేదా కలయికలో పాల్గొన్నా వీర్యం చిక్కగా ఉండదు. దీనికి భయపడాల్సిన పని లేదు, కొన్ని రోజులు గ్యాప్ ఇస్తే మళ్ళీ మామూలు అవుతుంది. అయితే వీర్యం పల్చగా ఉండటంతో పాటు రంగు మారినా, విపరీతమైన వాసన వచ్చినా మాత్రం అది ఇన్ఫెక్షన్ కావచ్చు. అప్పుడు డాక్టర్‌ను కలవడం మంచిది.

పిల్లల కోసం ప్లాన్ చేసేవారు వీర్యం చిక్కదనం కంటే, అందులో కణాలు ఎన్ని ఉన్నాయి, అవి ఎంత స్పీడుగా కదులుతున్నాయి అనేది చూసుకోవాలి. మంచి తిండి తిని, టైట్‌గా ఉండే డ్రాయర్లు వేసుకోవడం మానేసి, స్ట్రెస్ తగ్గించుకుంటే వీర్యం క్వాలిటీ అదే పెరుగుతుంది. అంతే తప్ప పల్చగా ఉందని ట్యాబ్లెట్లు వాడటం, కంగారు పడటం అవసరం లేదు.