Kidney Stones : ఎండకాలంలోనే ఎక్కువగా కిడ్నీలో రాళ్లు ఎందుకు వస్తాయి? ..

Kidney Stones

Kidney Stones :  ఎండలు తీవ్రమవుతున్న ఈ తరుణంలో మన ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ సీజన్‌లో చాలా మంది కిడ్నీ స్టోన్ (మూత్రపిండాల రాళ్లు) సమస్యతో బాధపడుతుంటారు. దీనికి ప్రధాన కారణం శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం, అంటే నిర్జలీకరణం. శరీరంలో తగినంత నీరు లేనప్పుడు, మన కిడ్నీలు శరీరం నుండి వ్యర్థాలను సరిగ్గా ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా బయటకు పంపలేవు. అప్పుడు మూత్రం చిక్కగా మారిపోతుంది. ఇలాంటి సమయంలో మూత్రంలో ఉండే క్యాల్సయం, ఆక్సలేట్, యూరిక్ ఆసిడ్ వంటి ఖనిజాలు, లవణాలు చిన్న చిన్న హరళుల్లా మారిపోతాయి. కాలక్రమేణా ఇవి ఒకదానితో ఒకటి కలిసి పెద్ద రాళ్లుగా మారిపోతాయని మూత్రపిండాల వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ సమస్య వేసవిలో ఎక్కువగా రావడానికి ప్రధాన కారణం మనం చెమట ద్వారా చాలా నీటిని కోల్పోవడమే. ఈ కోల్పోయిన నీటిని మనం వెంటనే నీరు తాగడం ద్వారా భర్తీ చేసుకోకపోతే, మూత్రపిందం రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. కేవలం నీటి కొరత మాత్రమే కాకుండా, మన ఆహారపు అలవాట్లు కూడా దీనికి కారణం కావచ్చు. ఉప్పు ఎక్కువగా ఉండే ఫాస్ట్ ఫుడ్, నిల్వ ఉంచిన పదార్థాలను అతిగా తినడం వల్ల కూడా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవచ్చు. అలాగే పాలాకూర, టీ, చాక్లెట్, కొన్ని రకాల ఎండు ఫలాలు (డ్రై ఫ్రూట్స్) లో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని అతిగా తింటే కూడా కిడ్నీ స్టోన్ ముప్పు పెరుగుతుంది. ఇక వ్యాయామం చేయకుండా గంటల తరబడి ఒకే చోట కూర్చొని పని చేయడం వల్ల కూడా కిడ్నీ ఆరోగ్యం దెబ్బతింటుంది.

మీకు కిడ్నీలో రాళ్లు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి కొన్ని లక్షణాలను గమనించాలి. సాధారణంగా నడుము కింది భాగంలో లేదా కడుపు పక్కన విపరీతమైన నొప్పి వస్తుంది. మూత్రం విసర్జించేటప్పుడు మంటగా అనిపించడం, మూత్రంలో రక్తం పడటం, తరచుగా మూత్రానికి వెళ్లాల్సి రావడం, వాంతులు లేదా వికారం వంటివి కిడ్నీ స్టోన్ ముఖ్య లక్షణాలు. ఈ సమస్యను నివారించడానికి సులభమైన మార్గం శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం. వేసవిలో ప్రతిరోజూ కనీసం 2.5 నుండి 3 లీటర్ల నీరు తాగాలి. కేవలం నీరు మాత్రమే కాకుండా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవ పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. జంక్ ఫుడ్, ఉప్పు తగ్గించి, సమతుల్య ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం వల్ల కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.