Telangana Jobs: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు త్వరలోనే ఒక భారీ శుభవార్త అందనుంది. రాష్ట్ర హోం శాఖలో ఖాళీగా ఉన్న సుమారు 17,992 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీల వివరాలను అధికారులు గుర్తించి, నియామక ప్రక్రియకు సంబంధించిన పూర్తి నివేదికను సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం క్యాబినెట్ సబ్ కమిటీ పరిశీలనలో ఉంది. ప్రభుత్వం నుండి అధికారిక ఆమోదం లభించిన వెంటనే హోం శాఖ పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ను విడుదల చేయనుంది.
ఈ భారీ నియామకాల్లో ప్రధానంగా పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ (SI) పోస్టులతో పాటు టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అయితే ఈసారి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల ఎంపిక విధానంలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం జోనల్ స్థాయిలో జరుగుతున్న ఎస్ఐ నియామకాలను, మరింత పారదర్శకత కోసం, ఎంపిక ప్రక్రియను సులభతరం చేసేందుకు రాష్ట్ర స్థాయిలో నిర్వహించాలని అధికారులు ప్రభుత్వానికి సూచించారు. ఈ మార్పుల వల్ల నియామక ప్రక్రియలో వేగం పెరుగుతుందని భావిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా యూనిఫామ్ సర్వీసుల్లో చేరాలనుకునే యువతకు ఇది ఒక గొప్ప అవకాశంగా మారనుంది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే వయోపరిమితి, విద్యార్హతలు మరియు పరీక్షా విధానానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
