Gold : బంగారం కొనేటప్పుడు 14k, 18k, 22k అని రకరకాలుగా వింటూ ఉంటాం. అసలు వీటి మధ్య తేడా ఏంటి? ఏది దేనికి వాడతారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. బంగారం స్వచ్ఛతను కొలిచే కొలమానాన్ని క్యారెట్ అంటారు. బంగారంలో రాగి లేదా జింక్ వంటి ఇతర లోహాలు ఎంత మొత్తంలో కలిశాయో ఇది చెబుతుంది. క్యారెట్ విలువ ఎంత ఎక్కువగా ఉంటే, ఆ బంగారంలో స్వచ్ఛత అంత ఎక్కువగా ఉంటుందని అర్థం.
24 క్యారెట్ (24K): అత్యంత స్వచ్ఛమైనది
ఇందులో 99.9% స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. వేరే ఇతర లోహాలు కలవవు. ఇది చాలా మెత్తగా ఉండి, త్వరగా వంగిపోతుంది కాబట్టి దీనితో నగలు చేయడం సాధ్యం కాదు. అందుకే దీనిని ఎక్కువగా బంగారు బిస్కెట్లు లేదా నాణేల రూపంలో దాచుకోవడానికి ఉపయోగిస్తారు.
22 క్యారెట్ (22K): ఆభరణాలకు మేటి
మనం వేసుకునే నగలు తయారీకి ఇదే అత్యంత అనువైనది. ఇందులో 91.6% బంగారం మరియు 8.4% ఇతర లోహాలు (రాగి, వెండి వంటివి) కలుపుతారు. అందుకే దీనిని 916 హాల్ మార్క్ బంగారం అని కూడా అంటారు. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి రోజువారీ వాడే నగలకు ఇది సరైన ఎంపిక.
18 క్యారెట్ (18K): వజ్రాభరణాల కోసం
ఇందులో 75% బంగారం, 25% ఇతర లోహాలు ఉంటాయి. వజ్రాలు లేదా ఇతర ఖరీదైన రాళ్లు పొదిగే నగలను తయారు చేయడానికి 18 క్యారెట్ బంగారాన్ని ఉపయోగిస్తారు. 22 క్యారెట్ కంటే ఇది మరింత బలంగా ఉంటుంది కాబట్టి రాళ్లు ఊడిపోకుండా గట్టిగా పట్టుకుంటుంది.
14 క్యారెట్ (14K): తక్కువ ధరలో..
ఇందులో కేవలం 58.3% మాత్రమే బంగారం ఉంటుంది. తక్కువ ధరలో లభించే చిన్న చిన్న నగలు లేదా నిత్యం ధరించే సాధారణ ఆభరణాలకు దీనిని వాడుతుంటారు. బంగారం ధరతో పాటు చేసే పనితనం, తరుగు వంటివి కూడా క్యారెట్లను బట్టి మారుతుంటాయి.
