Credit Card : మారిన క్రెడిట్ కార్డ్ రూల్స్.. బ్యాంకులకు కొత్త ఆర్డర్!

Credit Card

Credit Card :  మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే ఈ కొత్త నియమాల గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఇప్పటివరకు మనం ఎంత ఖర్చు చేసినా పెద్దగా పట్టించుకోకపోయినా, ఇకపై పన్ను శాఖ మన ఖర్చులపై నిఘా పెట్టబోతోంది. ఒక సంవత్సరంలో మీ క్రెడిట్ కార్డు బిల్లులన్నీ కలిపి పది లక్షల రూపాయలు దాటితే, ఆ విషయాన్ని బ్యాంకులు నేరుగా ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసుకి చెప్పేస్తాయి. అంతేకాదు, మీ కార్డు బిల్లును ఒక లక్ష రూపాయల కంటే ఎక్కువ నగదు రూపంలో కడితే, ఆ లావాదేవీని విడిగా రికార్డ్ చేసి మరి తనిఖీ చేస్తారు. నల్లధనాన్ని అరికట్టడం కోసమే ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంది.

విదేశాలకు వెళ్ళినప్పుడు కార్డు వాడే విషయంలో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. మీ పాన్ కార్డుకి లింక్ అయిన క్రెడిట్ కార్డు అయితే పది లక్షల వరకు ఖర్చు చేసుకోవచ్చు. కానీ పాన్ కార్డు లింక్ లేని కార్డుల ద్వారా ఐదు లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే, ఆ వివరాలు వెంటనే టాక్స్ డిపార్ట్‌మెంట్‌కి వెళ్ళిపోతాయి. అలాగే బ్యాంకులు ఇచ్చే ఆఫర్లు కూడా తగ్గుతున్నాయి. ఉదాహరణకు, ఎస్‌బీఐ క్యాష్‌బ్యాక్ కార్డు మీద ఇచ్చే లాభాన్ని నాలుగు వేల రూపాయలకే పరిమితం చేశారు. ఆన్‌లైన్ షాపింగ్‌కి రెండు వేలు, బయట కొనే వాటికి రెండు వేల చొప్పున మాత్రమే ఇప్పుడు క్యాష్‌బ్యాక్ వస్తుంది.

కంపెనీలు ఇచ్చే కార్డులు వాడే వారు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసు పనుల కోసం ఇచ్చిన కార్డుతో మీ వ్యక్తిగత వస్తువులు కొంటే, దాన్ని మీ జీతం కింద లెక్కగట్టి పన్ను వేసే అవకాశం ఉంటుంది. అందుకే ఆఫీసు ఖర్చులని, మీ సొంత ఖర్చులని వేర్వేరుగా ఉంచుకోవడం మంచిది. ఇక మీరు కొత్త కార్డు కోసం అప్లై చేస్తే, బ్యాంకులు ఏడు రోజుల్లోనే మీకు సమాధానం చెప్పాలి. ఒకవేళ మీ అప్లికేషన్‌ను రిజెక్ట్ చేస్తే, ఎందుకు రిజెక్ట్ చేశారో కూడా రాసి ఇవ్వడం ఇప్పుడు తప్పనిసరి చేశారు. ఈ మార్పులన్నీ ఎక్కువగా డబ్బులు ఖర్చు చేసే వారిని దృష్టిలో పెట్టుకునే తెచ్చారని నిపుణులు చెబుతున్నారు.