Hyderabad :హైదరాబాద్‌లోని మియాపూర్ పరిధిలో ఈరోజు ఉదయం ఒక ప్రైవేట్ మినీ బస్సు ప్రమాదానికి గురైంది. కూకట్‌పల్లి KPHB నుండి లీ ఫార్మా కంపెనీకి చెందిన మినీ బస్సు సుమారు 10 మంది ఉద్యోగులతో గడ్డపోతారం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. బాచుపల్లి సమీపంలోని ఒక మలుపు వద్ద బస్సు వేగంగా వెళ్తూ అదుపు తప్పి ఒక్కసారిగా రోడ్డుపై బోల్తా పడింది.
ఈ ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ఉద్యోగులందరికీ గాయాలయ్యాయి. వీరిలో ఎక్కువ మందికి స్వల్ప గాయాలైనప్పటికీ, ఒక ఉద్యోగి పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను బస్సులో నుండి బయటకు తీసి, చికిత్స నిమిత్తం దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే మలుపు వద్ద బస్సు అదుపు తప్పిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. రోడ్డుపై బోల్తా పడిన బస్సును తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
