YS Jagan : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అద్దంకి నియోజకవర్గ స్థానిక నేతలతో ఈరోజు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఆయన శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
అద్దంకి మనం గెలవలేని నియోజకవర్గమేమీ కాదని జగన్ తన క్యాడర్లో భరోసా నింపారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై, ముఖ్యంగా స్థానిక మంత్రిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలను వివరిస్తే విజయం మనదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
గత ఎన్నికల హామీలను గుర్తు చేస్తూ చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు. “గతంలో వైసీపీ అమలు చేసిన పథకాలన్నీ కొనసాగిస్తానని, పైగా సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఇస్తానని సీఎం చంద్రబాబు చెప్పారు. కానీ ఇప్పుడు మన హయాంలో వచ్చిన పథకాలన్నీ రద్దు అయ్యాయి. ఇస్తానన్న హామీలకు దిక్కులేదు. మేనిఫెస్టోను చంద్రబాబు చెత్తబుట్టలో వేశారు” అని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలోని పోర్టుల అభివృద్ధిపై కూడా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. “మా హయాంలో 3 ప్రభుత్వ రంగ పోర్టులను తీసుకువచ్చాం. కానీ రెండేళ్లు గడిచినా పనులు ముందుకు సాగడం లేదు. అంతా తమ వారికి సబ్ కాంట్రాక్టులు ఇప్పించుకోవడానికే చూస్తున్నారు. ప్రతి విషయంలోనూ ‘నాకేంటి?’ అని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. పోర్టుల చుట్టుపక్కల భూములను మళ్లీ లాక్కునే ప్రయత్నం జరుగుతోంది.”
రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన జరగనుండటం కార్యకర్తలకు శుభవార్త అని జగన్ అన్నారు. మహిళా రిజర్వేషన్ల వల్ల చట్టసభల్లో మహిళలకు మరిన్ని సీట్లు వస్తాయని, మన కార్యకర్తలు నాయకులుగా ఎదిగే అవకాశం ఉందని చెప్పారు. జగన్ 2.0లో పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు, నాయకులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
