Ichchapuram : ఎవడ్రా నువ్వు నన్ను అడగడానికి? గిరిజనులపై TDP MLA ఫైర్!

Ichchapuram

Ichchapuram : శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. తమ సమస్యలను విన్నవించుకోవడానికి వచ్చిన గిరిజన సంఘం నేతలపై స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గిరిజన నేతలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా, తీవ్ర దుమారానికి దారితీశాయి.

నియోజకవర్గంలోని గిరిజన సమస్యలపై, ముఖ్యంగా అసెంబ్లీలో ఆదివాసీల గొంతు వినిపించాలని కోరుతూ గిరిజన సంఘం నేతలు ఎమ్మెల్యే అశోక్‌ను కలిశారు. అయితే వారి అభ్యర్థనపై సానుకూలంగా స్పందించాల్సింది పోయి, ఎమ్మెల్యే ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. గిరిజనులపై “బ్లడీ బాస్టర్డ్.. నువ్వు ఎవ్వడ్రా నన్ను అడగడానికి?” అంటూ మండిపడ్డారు.

గిరిజన నేతల విన్నపంపై ఎమ్మెల్యే అశోక్ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. “నీకు బుర్ర ఉండి మాట్లాడుతున్నావా? లేక బుర్ర దె*గి మాట్లాడుతున్నావా? అసలు ఆఫ్ నాలెడ్జ్ పీపుల్ నా దగ్గరకు ఎందుకు వచ్చారు?” అంటూ దుర్భాషలాడారు. నియోజకవర్గంలో తాను ఏం చేయాలో కూడా మీరే చెప్తారా? అంటూ నిలదీశారు. తాను ఏం చేయాలో తనకు తెలుసని, అనవసరంగా తన వద్దకు వచ్చి సలహాలు ఇవ్వొద్దని గిరిజన నేతలను కసురుకున్నారు.

ప్రజా ప్రతినిధిగా ఉండి, సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన వారిపై ఇలాంటి అసభ్యకర పదజాలంతో విరుచుకుపడటంపై గిరిజన సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్యే వైఖరిని తప్పుబడుతూ ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.