Rupali Chakankar : మహారాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేగుతోంది. గత వారం రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ పదవికి గుడ్‌బై చెప్పిన రూపాలీ చాకంకర్, తాజాగా ఎన్సీపీ మహిళా విభాగం అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. వివాదాస్పద జ్యోతిష్యుడు అశోక్ ఖరాత్‌తో ఆమెకు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.
జ్యోతిష్యుడు అశోక్ ఖరాత్ అరెస్ట్ అయినప్పటి నుండి రూపాలీ చాకంకర్ పేరు మాత్రం మారుమోగుతోంది. అతని అక్రమ లావాదేవీల్లో చాకంకర్కు వాటా ఉందంటూ ప్రతిపక్షాలు, స్వపక్షంలోని కొందరు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ పరువు పోతోందని నాసిక్, అహిల్యానగర్ జిల్లాల నేతలు ఉప ముఖ్యమంత్రి, పార్టీ అధినేత్రి సునేత్రా పవార్‌పై ఒత్తిడి తేవడంతో ఆమె తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ఇంతకు రూపాలీ చాకంకర్ ఎవరు?
రూపాలీ చాకంకర్ 1982లో మహారాష్ట్రలోని పుణెలో జన్మించారు. ఆమె విద్యాభ్యాసం అంతా పుణెలోనే సాగింది.ఆమె అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (NCP) పార్టీలో కీలక నేత. క్షేత్రస్థాయి నుంచి పనిచేస్తూ పార్టీలో మహిళా విభాగం అధ్యక్షురాలి స్థాయికి ఎదిగారు. రూపాలి చాకంకర్ అత్తగారైన రుక్మిణి చాకంకర్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్‌గా ఉండేవారు. ఆమె ద్వారానే రూపాలి చాకంకర్ రాజకీయాల్లోకి వచ్చారు.
2002 నుండి ఆమె 5-6 సంవత్సరాల పాటు మహిళా స్వయం సహాయక బృందంలో పనిచేశారు. ఆ తర్వాత ఆమెకు ఖడక్వాస్లా అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షురాలి పదవి లభించింది. అక్కడి నుంచి రూపాలి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆమె ఆస్తులు రూ. 7 కోట్లుగా ఉన్నాయని సమాచారం. ఈమె భర్త నిలేష్ చాకంకర్ కాగా వీరికి సోహన్ చాకంకర్ అనే ఓ కూమారుడున్నాడు. అతను మరాఠీ సినిమాల్లో నటిస్తున్నాడు.
ఇక అశోక్ ఖరాత్ పుణె పరిసర ప్రాంతాల్లో సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవారు. ఈ క్రమంలోనే రూపాలీ చాకంకర్తో ఆయనకు పరిచయం ఏర్పడిందని సమాచారం. సోషల్ మీడియాలో అశోక్ ఖరాత్‌తో కలిసి రూపాలీ చాకంకర్ ఉన్న ఫోటోలు బయటకు రావడంతో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉందనే ఆరోపణలు మొదలయ్యాయి.
Also Read : Rupali Chakankar : జ్యోతిష్యుడితో అడ్డంగా దొరికిపోయి .. రూపాలీ మరో సంచలనం!
