Post Office RD Scheme : భవిష్యత్తు కోసం కొంత డబ్బు దాచుకోవాలని ప్రతి ఒక్కరికీ ఆశ ఉంటుంది. కానీ కష్టపడి సంపాదించిన డబ్బును ఎక్కడ పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి, అలాగే రిస్క్ లేకుండా ఉంటుందనే టెన్షన్ చాలామందిని వేధిస్తుంటుంది. మీరు కూడా ఇలాంటి సురక్షితమైన పొదుపు పథకం కోసం చూస్తుంటే, పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న ఈ సూపర్ స్కీమ్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి.
పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) పథకం ఇప్పుడు మధ్యతరగతి ప్రజలకు, రోజువారీ కూలీలకు ఫేవరెట్ ఆప్షన్‌గా మారిపోయింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఇది వందకు వంద శాతం సురక్షితంగా ఉండటంతో పాటు అదిరిపోయే లాభాలను అందిస్తుంది. ఈ స్కీమ్ ప్రత్యేకత ఏమిటంటే, మీరు ప్రతి నెలా చిన్న మొత్తాన్ని డిపాజిట్ చేస్తూ వెళ్తే, ఐదేళ్ల తర్వాత ఒకేసారి పెద్ద మొత్తం మీ చేతికి అందుతుంది.
ఇందులో పెట్టుబడిదారులు ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తాన్ని కట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌పై వార్షికంగా 6.7 శాతం వడ్డీని అందిస్తోంది. మరో సంతోషకరమైన విషయం ఏంటంటే, ఈ వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి లెక్కించడం వల్ల మీ లాభం ఇంకా పెరుగుతుంది.
నెలకు కేవలం 100 రూపాయలు కట్టడం ద్వారా మీరు ఖాతా తెరవవచ్చు. గరిష్టంగా ఎంతైనా డిపాజిట్ చేయవచ్చు, దానికి ఎటువంటి పరిమితి లేదు. మీ ఆర్థిక పరిస్థిత, వీలును బట్టి నెలకు ఎంత కావాలంటే అంత డబ్బు కట్టుకోవచ్చు.
ఒకసారి లెక్కలు చూస్తే.. మీరు ఐదేళ్ల పాటు ప్రతి నెలా 5,000 రూపాయలు ఈ ఆర్డీలో కడితే, మీ మొత్తం డిపాజిట్ 3 లక్షల రూపాయలు అవుతుంది. దీనిపై మీకు ఏకంగా 56,830 రూపాయల వడ్డీ వస్తుంది. అంటే మెచ్యూరిటీ సమయానికి మీ అసలు,వడ్డీ కలిపి మొత్తం 3,56,830 రూపాయలు మీ చేతికి అందుతాయి.
మొత్తంగా చూస్తే, కేవలం ఐదేళ్లలో మీ అసలు డబ్బుకు ఎలాంటి రిస్క్ లేకుండా సుమారు 57 వేల రూపాయల నికర లాభం మీకు లభిస్తుంది. బ్యాంకులు లేదా షేర్ మార్కెట్లలో డబ్బులు పెట్టి టెన్షన్ పడేకంటే, ఇలాంటి సేఫ్ స్కీమ్‌లలో పెట్టుబడి పెడితే ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఈ ఆర్డీ స్కీమ్‌ను నేరుగా భారత ప్రభుత్వమే నడుపుతోంది కాబట్టి మీ డబ్బుకు పూర్తి భద్రత ఉంటుంది.
