Vijayashanthi : రెండేళ్లయినా ఒక్క హామీ నెరవేర్చలేదు.. రేవంత్ పై రాములమ్మ ఫైర్!

Vijayashanthi

Vijayashanthi :  కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. శాసన మండలి వేదికగా ఆమె తన సొంత ప్రభుత్వంపైనే అడిగిన సూటి ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై విజయశాంతి అసహనం వ్యక్తం చేశారు. ఉద్యమకారులకు మనం ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయి? అంటూ ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, అలాగే నెలకు 25 వేల రూపాయల గౌరవ పెన్షన్ అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామని ఆమె గుర్తు చేశారు.

అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా, ఇప్పటివరకు ఉద్యమకారులకు సంబంధించి ఒక్క హామీ కూడా నెరవేరలేదని విజయశాంతి మండిపడ్డారు. మమ్మల్ని నమ్మి ఓట్లేసిన ఉద్యమకారులు.. మాకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీస్తున్నారు. వారికి మేం ఏం సమాధానం చెప్పాలి? అని ఆమె ప్రశ్నించారు.

ముఖ్యంగా, జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులందరికీ ప్రభుత్వ గుర్తింపు కార్డులు అందజేస్తామని ఇచ్చిన హామీ కూడా ఇంకా కార్యరూపం దాల్చలేదని ఆమె గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని, ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని విజయశాంతి డిమాండ్ చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్సీనే ఇలా బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేయడంతో, ప్రభుత్వం ఇప్పుడు ఈ అంశంపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.