mounika : డేటింగ్ యాప్ లో పరిచయం.. భార్యను పుట్టింటికి పంపించి.. పోలీసులు సంచలనం!

mounika

mounika :  విశాఖపట్నం జిల్లా గాజువాకలో అత్యంత దారుణమైన హత్య వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం చివరకు ఒక మహిళ ప్రాణం తీయడమే కాకుండా, ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికే స్థాయికి దారితీసింది. గజువాక ఏసీపీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండియన్ నేవీలో పనిచేస్తున్న చింతడ రవీంద్ర అనే వ్యక్తి, మౌనిక అనే యువతిని అతి దారుణంగా హత్య చేశాడు. వీరిద్దరికీ 2021లో ‘మింగిల్’ అనే డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి, వీరిద్దరూ సన్నిహితంగా ఉండేవారు. మౌనిక పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో పనిచేసేది.

అయితే, 2024లో రవీంద్రకు వేరే మహిళతో వివాహం జరిగింది. పెళ్లయినప్పటికీ రవీంద్ర తన భార్యకు తెలియకుండా మౌనికతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. ఇటీవల రవీంద్ర భార్య గర్భవతి కావడంతో ఆమె తన పుట్టింటికి వెళ్ళింది. ఇదే అదనుగా భావించిన రవీంద్ర, మౌనికను తరచూ గాజువాకలోని తన ఫ్లాట్‌కు పిలిపించుకునేవాడు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ఏదో విషయంలో గొడవ జరిగింది. ఆ గొడవ ముదిరిపోవడంతో ఆవేశానికి లోనైన రవీంద్ర, మౌనిక నోరు, ముక్కు గట్టిగా నొక్కి ఊపిరాడకుండా చేసి ప్రాణం తీశాడు.

హత్య చేసిన తర్వాత ఎవరికీ తెలియకుండా ఆధారాలు మాయం చేసేందుకు రవీంద్ర చాలా భయంకరమైన పని చేశాడు. మౌనిక మృతదేహాన్ని ముక్కలుగా నరికి తల, చేతులు, కాళ్లను వేరు చేశాడు. తల, చేతులను అడవివరం దగ్గర్లోని ఒక ఖాళీ స్థలానికి తీసుకెళ్లి అక్కడ తగులబెట్టేశాడు. ఇక మిగిలిన శరీర భాగాలను, కాళ్లను ఎవరికీ అనుమానం రాకుండా తన ఇంట్లోని ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. మిగిలిన భాగాలను కూడా తర్వాత ఎక్కడైనా పారేయాలని ప్లాన్ చేశాడు.

మరోవైపు మౌనిక ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మౌనిక అదృశ్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా రవీంద్ర అరాచకం బయటపడింది. ఫ్రిజ్‌లో దాచిన శరీర భాగాలను పారేయకముందే పోలీసులు నిందితుడు రవీంద్రను పట్టుకుని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.