BIG TV : తెలుగు మీడియా రంగంలో ప్రముఖ వార్తా సంస్థ అయిన ‘బిగ్ టీవీ’లో ఒక్కసారిగా పెను సంచలనం చోటుచేసుకుంది. పల్స్ న్యూస్ బ్రేకింగ్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ పోస్టు చేసింది. సంస్థలో గత కొంతకాలంగా సాగుతున్న ఆధిపత్య పోరు చిలికి చిలికి గాలివానలా మారిందని తెలుస్తోంది, అంతర్గత విభేదాల నేపథ్యంలో బిగ్ టీవీ సీఈవో అజయ్ కొండా తన పదవికి రాజీనామా చేశారని సమాచారం. ఆయనతో పాటు మేనేజింగ్ ఎడిటర్ సతీష్ కూడా సంస్థను వీడారని మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

కేవలం ఉన్నతాధికారులే కాకుండా, ఛానల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మరికొందరు ముఖ్యమైన జర్నలిస్టులు కూడా తమ పదవులకు రాజీనామా చేశారని తెలుస్తోంది. ఇన్పుట్ ఎడిటర్ నగేష్.టీ, స్వేచ్ఛ ఎడిటర్ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, మెదక్ సీనియర్ రిపోర్టర్ దుర్గారెడ్డి, అనంతపూర్ రిపోర్టర్ యోగానంద్, అలాగే డిజిటల్ హెడ్ కార్తీక్ పవన్ గాదె వంటి వారు ఈ జాబితాలో ఉన్నట్లుగా ట్విట్టర్ లో న్యూస్ చక్కర్లు కొడుతోంది.
వీరితో పాటు మరో 50 మందికి పైగా జర్నలిస్టులు కూడా మూకుమ్మడిగా రిజైన్ చేసినట్లు సమాచారం అందుతోంది. ఒక్కసారిగా ఇంతమంది కీలక వ్యక్తులు తప్పుకోవడంతో అసలు ఇంతటి ఆధిపత్య పోరుకు కారణమేంటి అన్నది ఇప్పుడు మీడియా సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారింది. అయితే ఇందులో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది. ఈ విషయంపై బిగ్ టీవీ యాజమాన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
