MeeSeva : మీసేవ బిగ్ షాక్: నేటి నుంచే భారీగా పెరిగిన ధరలు!

mee seva

MeeSeva : తెలంగాణలో మీసేవ సేవల ధరలు భారీగా పెరిగాయి. కొత్త చార్జీలు నేటి నుంచే అమలులోకి వచ్చాయి. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ప్రభుత్వం ఈ ధరలను సవరించింది. చివరిసారిగా 2018-19లో ఈ చార్జీలను మార్చారు. డిజిటల్ సేవల నెట్‌వర్క్‌ను సమర్థవంతంగా నిర్వహించడానికే ఈ పెంపు అని అధికారులు చెబుతున్నారు.

పెరిగిన ధరల వివరాలను చూస్తే.. ఆదాయం, కులం, నివాస ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డు దరఖాస్తులు లేదా మార్పుల కోసం ఇకపై 80 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈసీ, జనన ధృవీకరణ పత్రం ప్రింట్, డ్రైవింగ్ లైసెన్స్ ఫీజులు, ఎల్ఎల్ఆర్ స్లాట్ బుకింగ్ వంటి సేవలకు 62 రూపాయలుగా నిర్ణయించారు. రైతు రిజిస్ట్రేషన్ కోసం 18 రూపాయలు, ఈ-పాస్ బయోమెట్రిక్ కోసం 35 రూపాయలు చెల్లించాలి.

జిరాక్స్ లేదా స్కాన్ చేసే విషయంలో కూడా ప్రభుత్వం కొత్త నిబంధన తెచ్చింది. ఏదైనా పని కోసం మొదటి నాలుగు పేజీల కంటే ఎక్కువ స్కాన్ చేయాలన్నా లేదా ప్రింట్ తీయాలన్నా.. అదనంగా ఒక్కో పేజీకి 2.50 రూపాయలు వసూలు చేస్తారు.

కరెంటు బిల్లుల చెల్లింపులపై కూడా చార్జీలు పెరిగాయి. బిల్లు మొత్తాన్ని బట్టి ఈ ఫీజులు ఉంటాయి. 200 రూపాయల లోపు బిల్లు కడితే 4 రూపాయలు, 201 నుండి 1,000 రూపాయల వరకు అయితే 9 రూపాయలు, 1,001 నుండి 2,500 వరకు అయితే 18 రూపాయలు వసూలు చేస్తారు. 2,500 కంటే ఎక్కువ బిల్లు ఉంటే 44 రూపాయల చార్జీ పడుతుంది. ఒకవేళ మీసేవ కేంద్రాల్లో ఎవరైనా నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తే 1800 425 1110 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం సూచించింది.