Jabardasth Komurakka: అభిమానులమని నమ్మించి జబర్దస్త్ కొమురక్కపై దాడి

Jabardasth Komurakka

Jabardasth Komurakka:  బుల్లితెరపై తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న జబర్దస్త్ ఆర్టిస్ట్ కొమురక్కకు చేదు అనుభవం ఎదురైంది. అభిమానులమని నమ్మించి ఆమె ఇంటికి వచ్చిన కొందరు వ్యక్తులు.. ఆమెతో పాటు కుటుంబ సభ్యులపై కర్రలు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా ఉడిత్యాల గ్రామంలో కలకలం రేపింది.

పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కాశిరెడ్డిగూడకు చెందిన శ్రీనాథ్ అనే యువకుడు కొమురక్క వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. గతంలో కొమురక్క ఇంట్లో కొంత బంగారం చోరీకి గురికాగా, ఆ విషయంలో శ్రీనాథ్‌పై అనుమానం వచ్చి ఆమె నిలదీశారు. తాను బంగారం తీసుకున్నట్లు ఒప్పుకున్న శ్రీనాథ్, తిరిగి ఇచ్చేస్తానని చెప్పి కాలయాపన చేస్తూ వచ్చాడు. రెండు రోజుల క్రితం కొమురక్క అతడిని మరోసారి గట్టిగా మందలించడంతో, ఈ విషయాన్ని శ్రీనాథ్ తన స్నేహితులకు చెప్పాడు.

మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో శ్రీనాథ్ స్నేహితులు వంశీకృష్ణ, వికాస్, చంద్రశేఖర్ సహా ఎనిమిది మంది కొమురక్క ఇంటికి చేరుకున్నారు. తాము అభిమానులమని, ఫోటోలు దిగాలని కోరడంతో ఆమె బయటకు వచ్చారు. ఆ సమయంలో రామ్‌చరణ్ అనే వ్యక్తి.. శ్రీనాథ్‌ను ఎందుకు తిట్టావంటూ గొడవకు దిగాడు. మాట మాట పెరగడంతో వంశీకృష్ణ అనే నిందితుడు రాయి తీసుకోని కొమురక్కపై దాడికి ప్రయత్నించాడు. ఆమెను రక్షించేందుకు వచ్చిన సోదరుడు యాదయ్యపై వికాస్ రాయితో దాడి చేయగా, చంద్రశేఖర్ కర్రతో కొమురక్క కుడి చేతిపై కొట్టాడు. అడ్డువచ్చిన స్థానిక యువకుడు రాముపై కూడా రాళ్లతో దాడి చేశారు.

నిందితులు అక్కడి నుంచి పారిపోయే క్రమంలో తమ ద్విచక్ర వాహనాన్ని వదిలేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దాడికి పాల్పడిన ఎనిమిది మందిని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు ఎస్సై లెనిన్ వివరాలను వెల్లడించారు.