Kruthika case : డాక్టర్ కృతిక రెడ్డి హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె భర్త, నిందితుడైన మహేంద్ర రెడ్డి పంపిన సెల్ ఫోన్ మెసేజ్‌లు ఈ దారుణ హత్య వెనుక ఉన్న కుట్రను బట్టబయలు చేశాయి. వైద్యుడైన మహేంద్ర రెడ్డి, తన వృత్తిపరమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించి కృతికకు ప్రోపోఫోల్ అనే అనస్థీషియా మందును ఓవర్ డోస్ ఇచ్చి సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
నేరం జరిగిన తర్వాత సాక్ష్యాలను తుడిచేయడానికి, పోలీసులను తప్పుదోవ పట్టించడానికి మహేంద్ర రెడ్డి తన గర్ల్‌ఫ్రెండ్‌కు పంపిన మెసేజ్‌లు ఇప్పుడు కేసులో కీలకంగా మారాయి. పోలీసులు అడిగితే మనం కేవలం స్నేహితులమని చెప్పు.. పదే పదే ఫోన్ కాల్స్ ఎందుకు చేశావని అడిగితే, ఏదో సాయం కోసం చేశానని అబద్ధం ఆడు అంటూ అతను ఆమెకు సూచించినట్లు డిజిటల్ ఆధారాలు లభించాయి. అంతేకాకుండా, “నేను కృతికను చంపేశాను.. నేను హంతకుడిని, జైలుకు వెళ్తాను” అంటూ పశ్చాత్తాపం ప్రదర్శిస్తూనే నేరాన్ని ఒప్పుకున్నట్లుగా ఉన్న మరో మెసేజ్ కూడా పోలీసులకు చిక్కింది.
గతేడాది మే నెలలో వివాహం చేసుకున్న ఈ జంట మధ్య విభేదాలు రావడంతో కృతిక తన తండ్రి ఇంట్లో ఉంటోంది. ఆరోగ్యం బాగోలేదని పరామర్శించడానికి వెళ్లిన మహేంద్ర రెడ్డి, చికిత్స పేరుతో ఆమెకు వరుసగా రెండు రోజులు ఐవీ (IV) ఇంజక్షన్లు ఇచ్చాడు. ఆ తర్వాత ఆమె కుప్పకూలిపోవడంతో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మొదట ఇది సహజ మరణం అనుకున్నా, కృతిక సోదరి నికిత ఫిర్యాదుతో అసలు రంగు బయటపడింది. ఫోరెన్సిక్ రిపోర్టులో ఆమె శరీర అవయవాల్లో అనస్థీషియా మందు ఉన్నట్లు తేలడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
మహేంద్ర రెడ్డి కుటుంబానికి పాత నేర చరిత్ర ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. అతని సోదరులపై గతంలోనే మోసపూరిత కేసులు, బెదిరింపు కేసులు ఉన్నాయి. ఈ విషయాలన్నీ దాచి పెట్టి కృతికను పెళ్లి చేసుకున్నట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఫోన్‌పే,ఇతర యాప్‌ల ద్వారా దాదాపు 10 లక్షలకు పైగా డిజిటల్ ఫైళ్లను విశ్లేషించిన పోలీసులు, నిందితుడి బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించేలా పక్కా ఆధారాలు సేకరించారు.
