Missing: కొండల్లో ట్రెకింగ్.. 14 ఏళ్ల అమ్మాయి మిస్సింగ్!

missing

Missing: కర్ణాటకలో వరుసగా చోటుచేసుకుంటున్న ట్రెక్కర్ల అదృశ్యం ఘటనలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కేరళకు చెందిన 14 ఏళ్ల పాఠశాల విద్యార్థిని శ్రీ నంద, తన 40 మంది బంధువులతో కలిసి ఏప్రిల్ 7న చంద్రద్రోణ కొండల పర్యటనకు వెళ్ళింది. అయితే సాయంత్రం వేళ చీకటి పడటంతో ఆమె తన బృందం నుండి విడిపోయి అడవిలో దారి తప్పింది. కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు డ్రోన్లు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో లోతైన లోయలు, దట్టమైన అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఆపరేషన్‌లో కేరళ పోలీసులు కూడా కర్ణాటక అధికారులకు సహకరిస్తున్నారు.

మరోవైపు, కొద్దిరోజుల క్రితమే కేరళకు చెందిన ఐటీ ఉద్యోగిని శరణ్య కూడా కొడగులోని తడియండమోల్ శిఖరం వద్ద తప్పిపోయి వార్తల్లో నిలిచింది. ఆమె తన బృందం కంటే వేగంగా నడుస్తూ ఒంటరిగా దారి తప్పి, నాలుగు రోజుల పాటు దట్టమైన అడవిలో చిక్కుకుపోయింది. ఆహారం ఏమీ లేకపోయినా కేవలం నీటితోనే ఆమె ప్రాణాలను నిలుపుకుంది. అయితే ఈ ఘటనపై స్థానిక రాజకీయ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె కావాలనే ఇలా చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టిందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వరుస ఘటనలు పర్యాటకుల భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

ట్రెక్కర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు కఠినమైన నిబంధనలను (SOP) సిద్ధం చేస్తోంది. పర్యాటకులు తప్పిపోకుండా ఉండేందుకు ‘M-STEPS’ వంటి మొబైల్ ట్రాకింగ్ అప్లికేషన్లను తప్పనిసరి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ట్రెకింగ్ సమయంలో ఈ యాప్ ద్వారా వారి కదలికలను అధికారులు పర్యవేక్షిస్తారు. దీనితో పాటు సర్టిఫైడ్ గైడ్‌లకు వైర్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థలు కల్పించడం, ట్రెక్కర్లకు గ్రూప్ ఇన్సూరెన్స్ అందించడం, ట్రెకింగ్ బృంద నాయకులను జవాబుదారీ చేయడం వంటి సంస్కరణలను ప్రభుత్వం అమలు చేయనుంది. ఇవన్నీ భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను అరికట్టడానికి దోహదపడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.