ABN రాధాకృష్ణపై కేసు నమోదు!

radha krishna

ABN : ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ టీవీ ఛానల్ అధినేత వేమూరి రాధాకృష్ణపై అరకు లోయ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తొలి పలుకులు పేజీలో  ఆయన రాసిన  వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ స్థానిక వైసీపీ నాయకులు మండిపడుతున్నారు.

అరకు ఎమ్మెల్యే రేగం మత్యలింగం నేతృత్వంలో వైసీపీ నాయకులు ఈ రోజు ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఒక బాధ్యతాయుతమైన ఎడిటర్ పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పత్రికా రంగానికే మచ్చ తెచ్చేలా ఉందని విమర్శించారు. కేవలం చంద్రబాబు నాయుడిని మెప్పించడం కోసమే రాధాకృష్ణ ఇలాంటి పనులకు ఒడిగడుతున్నారని ఆయన ఆరోపించారు.

గిరిజన మహిళలను, ఇతర మహిళా ప్రతినిధులను కించపరిచేలా మాట్లాడటం సభ్య సమాజం అంగీకరించదని ఎమ్మెల్యే హెచ్చరించారు. రాధాకృష్ణ వెంటనే తన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ధోరణి వల్ల పరిస్థితులు ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా, వైసీపీ నేతల ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ఆయనపై విజయవాడలో కూడా కేసు నమోదైంది.