RBI : డిజిటల్ చెల్లింపుల్లో జరుగుతున్న మోసాలకు అడ్డుకట్ట వేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. రూ. 10,000 కంటే ఎక్కువ మొత్తంలో జరిపే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లపై ఒక గంట పాటు టైమ్ లాగ్ విధించాలని ఆర్బీఐ విడుదల చేసిన చర్చా పత్రంలో సూచించింది.
మీరు ఎవరికైనా రూ.10,000 కంటే ఎక్కువ పంపితే, ఆ డబ్బు వెంటనే అవతలి వ్యక్తి ఖాతాలో పడదు. ఒక గంట పాటు ఆగి క్రెడిట్ అవుతుంది. ఈ లోపు మీ ఖాతా నుంచి డబ్బు కట్ అయినట్లు చూపిస్తుంది. కానీ అవతలి వారికి చేరదు. ఈ గంట సమయంలో మీకు ఏదైనా అనుమానం వస్తే ఆ ట్రాన్సాక్షన్‌ను వెంటనే రద్దు చేసుకోవచ్చు. బ్యాంకులు కూడా ఈ సమయంలో లావాదేవీని పరిశీలించి, ఏదైనా తేడా ఉంటే మిమ్మల్ని హెచ్చరిస్తాయి.
70 ఏళ్లు పైబడిన వారు లేదా దివ్యాంగులు సైబర్ నేరగాళ్ల బారిన పడే అవకాశం ఎక్కువ కాబట్టి, వారి కోసం ట్రస్టెడ్ పర్సన్ (నమ్మకస్తులైన వ్యక్తి) అనే విధానాన్ని తెస్తున్నారు.₹50,000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగితే, ఆ వృద్ధుడు/దివ్యాంగుడు నియమించుకున్న నమ్మకస్తుడైన వ్యక్తి కూడా దానిని ధృవీకరించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ నమ్మకస్తుడైన వ్యక్తిని మార్చాలనుకుంటే, 24 గంటల నిరీక్షణ సమయం ఉంటుంది.
మీ ఖాతాలో ఏదైనా మోసం జరుగుతుందని అనిపిస్తే, ఒకే ఒక్క బటన్ లేదా సందేశంతో మీ డిజిటల్ పేమెంట్ సేవలన్నింటినీ తక్షణమే నిలిపివేసే కిల్ స్విచ్ సదుపాయాన్ని బ్యాంకులు కల్పించాలి. దీన్ని మళ్ళీ ఆన్ చేయాలంటే కఠినమైన వెరిఫికేషన్ లేదా నేరుగా బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటుంది.
కేవలం డబ్బు పంపడంపైనే కాదు, వచ్చే డబ్బుపై కూడా నిఘా పెంచుతున్నారు. కెవైసి (KYC) సరిగ్గా లేని ఖాతాలకు ఏడాదికి ₹25 లక్షల పరిమితి విధించాలని ప్రతిపాదించారు. అంతకంటే ఎక్కువ డబ్బు వస్తే, బ్యాంక్ ఆ డబ్బును హోల్డ్‌లో ఉంచి , అది సరైనదే అని నిర్ధారించుకున్నాకే ఖాతాలో వేస్తుంది.
అయితే ఈ గంట నిరీక్షణ సమయం అన్నింటికీ వర్తించదు.
- మర్చంట్ పేమెంట్స్: దుకాణాల్లో వస్తువులు కొన్నప్పుడు చేసే పేమెంట్లు.
- రీకరింగ్ పేమెంట్స్: ముందే సెట్ చేసుకున్న నెలవారీ బిల్లులు.
- వైట్‌లిస్ట్: మీరు నమ్మకస్తులని మార్క్ చేసిన వారికి పంపే డబ్బుకు ఈ నిరీక్షణ ఉండదు
దేశంలో జరుగుతున్న డిజిటల్ ఫ్రాడ్స్‌లో 98.5% విలువ ₹10,000 పైబడిన లావాదేవీల వల్లే జరుగుతున్నాయని ఆర్బీఐ గుర్తించింది. అందుకే వేగం కంటే భద్రత ముఖ్యమని ఈ నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. దీనిపై మే 8వ తేదీ వరకు ప్రజల అభిప్రాయాలను స్వీకరించి, ఆ తర్వాత తుది మార్గదర్శకాలను విడుదల చేస్తారు.
