Post Office Scheme : వడ్డీయే రూ.4.40 లక్షలు.. ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్తో లక్షాధికారి!

Post Office Scheme

Post Office Scheme :  మనం కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని భవిష్యత్తు అవసరాల కోసం ఎక్కడైనా భద్రంగా దాచుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆ చిన్న పొదుపే రేపు మనకు కొండంత అండగా నిలవాలి. దీనికోసం మనకున్న అత్యంత నమ్మకమైన మార్గం పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD). ఈ ప్రభుత్వ పథకంలో మీరు కేవలం వడ్డీ రూపంలోనే ఏకంగా 4.40 లక్షల రూపాయల వరకు లాభం పొందే అవకాశం ఉంది. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడానికి మీ దగ్గర లక్షలు ఉండాల్సిన అవసరం లేదు, నెలకు కేవలం 100 రూపాయలతో కూడా మీరు ఈ అకౌంట్‌ను ప్రారంభించవచ్చు. 18 ఏళ్లు నిండిన వారు ఎవరైనా తమకు దగ్గరలోని పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లి ఈ ఖాతాను ఓపెన్ చేయవచ్చు.

పోస్ట్ ఆఫీస్ పథకాలన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి కాబట్టి ఇక్కడ మీ డబ్బుకు నూటికి నూరు శాతం భరోసా ఉంటుంది. షేర్ మార్కెట్ హెచ్చుతగ్గుల భయం లేకుండా, రిస్క్ తీసుకోకుండా డబ్బు దాచుకోవాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక. ప్రస్తుతం ప్రభుత్వం ఈ ఆర్‌డీ పథకానికి 6.7 శాతం ఆకర్షక వడ్డీని అందిస్తోంది. సాధారణంగా ఈ పథకం కాలపరిమితి 5 ఏళ్లు ఉంటుంది, కానీ మీకు అప్పుడే డబ్బు అవసరం లేదనుకుంటే మరో ఐదేళ్ల పాటు (మొత్తం 10 ఏళ్లు) పొడిగించుకోవచ్చు. ఇలా ఎక్కువ కాలం పొదుపు చేయడం వల్ల మీ డబ్బుపై చక్రవడ్డీ కలిసి వచ్చి భారీ మొత్తంలో లాభం వస్తుంది.

ఒకవేళ మీరు అకౌంట్ తెరిచిన ఏడాది తర్వాత ఎప్పుడైనా అత్యవసరంగా డబ్బు అవసరమైతే, మీరు కట్టిన డబ్బుపై 50 శాతం వరకు లోన్ తీసుకునే సదుపాయం కూడా ఉంది. ఈ అప్పుపై వడ్డీ కూడా కేవలం 2 శాతమే ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చూస్తే..

మీరు రోజుకు ఒక 300 రూపాయలు పొదుపు చేసి నెలకు 9,000 రూపాయలు ఈ పథకంలో పెడితే, ఐదేళ్లకు మీరు కట్టే డబ్బు ₹5.40 లక్షలు అవుతుంది. అదే మీరు 10 ఏళ్ల పాటు ఈ పొదుపును కొనసాగిస్తే, మీరు కట్టే మొత్తం ₹10,80,000 అవుతుంది. కానీ మెచ్యూరిటీ సమయానికి వడ్డీతో కలిపి మీ చేతికి ఏకంగా 15,20,889 రూపాయలు వస్తాయి. అంటే కేవలం వడ్డీ రూపంలోనే మీరు దాదాపు రూ.4.40 లక్షల అదనపు ఆదాయాన్ని పొందుతారన్నమాట.