Shamshabad : ప్రభుత్వ ఉద్యోగి అని నమ్మించి, పెళ్లి పేరుతో అమాయక యువతులను బురిడీ కొట్టిస్తున్న ఒక ఘరానా మోసగాడిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాలకృష్ణ అనే వ్యక్తి సీఐఎస్ఎఫ్ అధికారిగా అవతారమెత్తి ఏకంగా 70 మందికి పైగా యువతులను తన మాయమాటలతో వంచించినట్లు తేలింది.
రెండో వివాహం కోసం 70 మందికి గాలం వేసిన నకిలీ ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్
శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాలకృష్ణ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు
శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాలకృష్ణ అనే వ్యక్తికి నాలుగేళ్ల కిందట వివాహం జరిగి ఒక కూతురు ఉండగా, మొదటి భార్యతో… pic.twitter.com/1jDzFFHPTh
— Telugu Scribe (@TeluguScribe) April 15, 2026
శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాలకృష్ణకు నాలుగేళ్ల క్రితమే వివాహమైంది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. అయితే, భార్యతో విభేదాల కారణంగా విడాకులు తీసుకున్న బాలకృష్ణ, రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇక్కడే అతను అడ్డదారి తొక్కాడు. సాధారణ వ్యక్తిగా పెళ్లి సంబంధాలు రావేమో అన్న అనుమానంతో, బాలకృష్ణ ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. తానొక సీఐఎస్ఎఫ్ అధికారిగా నకిలీ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు.
యూనిఫాంలో ఫోటోలు దిగి మ్యాట్రిమోనీ సైట్లలో అప్లోడ్ చేశాడు. సుమారు 70 మందికి పైగా యువతులతో చాటింగ్ చేస్తూ తానొక పెద్ద ప్రభుత్వ ఉద్యోగిని అని నమ్మించాడు. ముఖ్యంగా విడాకులు తీసుకున్న యువతులనే టార్గెట్ చేస్తూ, వారి సానుభూతి పొంది పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేసేవాడు.
బాలకృష్ణ మోసం ఎంతో కాలం సాగలేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో అనుమానాస్పదంగా సీఐఎస్ఎఫ్ యూనిఫాం మారుస్తుండగా అక్కడి అసలు భద్రతా సిబ్బంది కంటపడ్డాడు. అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని గట్టిగా విచారించగా, అసలు గుట్టు రట్టయింది. అతను ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగి కాదని, కేవలం పెళ్లిళ్ల కోసమే ఈ డ్రామా ఆడుతున్నాడని నిర్ధారించిన పోలీసులు, అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
